వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైకుంఠ ద్వార ప్రవేశానికి విచ్చేసే భక్తులు 24 గంటలకు పైగా కంపార్ట్‌మెంట్లు, షెడ్లలో వేచి ఉంటారని, వారందరికీ అంకితభావంతో మెరుగైన సేవలందించాలనే ప్రధాన ఉద్దేశంతో శ్రీవారి సేవకులను, స్కౌట్లను ఆహ్వానించామని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
వైకుంఠ ఏకాదశి సేవా విధులకు విచ్చేసిన శ్రీవారి సేవకులు, స్కౌట్లను ఉద్దేశించి తిరుమలలోని ఆస్థానమండపంలో ఈవో ప్రసంగించారు. భక్తుల్లో భగవంతుని దర్శించి సేవలందించాలని కోరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, కల్యాణవేదికలో కలిపి 85 వేల మంది భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు.
భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు, టి, కాఫి పంపిణీకి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశామని, మరుగుదొడ్ల వసతి కల్పించామని వివరించారు. మొత్తం 3500 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించామని, అన్నప్రసాద వితరణకు 1,500 మంది, విజిలెన్స్ విభాగంలో 1000 మంది, తాగునీటి పంపిణీకి 800 మంది సేవలందిస్తారని తెలిపారు.
మొత్తం 1300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తారని తెలియజేశారు. ముందుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, టిటిడి పిఆర్వో డా.టి.రవి, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో నాగరాజు, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్ఆర్.రెడ్డి, ఏపిఆర్వో కుమారి పి.నీలిమ, ఏఈవో యు.రమేష్, ఏఇ శ్రీ వరప్రసాద్, శ్రీవారి సేవ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.