రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకావాలని ప్రతి రైతు ఆత్మహత్యపై ఆడిట్ నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పుడ్ సెక్యురిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రతిరోజు పత్రికల్లో ఒకటి రెండు రైతు ఆత్మహత్యలు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయని అందుకు గల కారణాలను విశ్లేషించి వాటి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వ్యవసాయశాఖ అధికారులకు చెప్పారు. మాతృ మరణం సంభవిస్తే ఆ మరణంపై వైద్య ఆరోగ్యశాఖలో ఆడిట్ నిర్వహిస్తున్న విధంగానే రైతు ఆత్మహత్యలపై కూడా ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని సిఎస్ స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యకు సంబంధించి వచ్చే ప్రతి వార్తను పరిశీలించి అందుకుగల కారణాలను విశ్లేషించి ఆలాంటి మరణాలు జరకుండా తీసుకోవాల్సిన చర్యలపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పుడ్ సెక్యురిటీ మిషన్ ఆశయాలు నెరవేరాలంటే రైతు ఆత్మహత్యలు జరగకూడదని ఆదిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్,ఎస్ఎల్బిసి కన్వీనర్ కెవి.నాంచారయ్య,వ్యవసాయశాఖ కన్సల్టెంట్ శర్మ,ఇంకా నాబార్డు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
previous post
next post