40.2 C
Hyderabad
April 26, 2024 14: 05 PM
Slider హైదరాబాద్

బాలానగర్​ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్​రాం నామకరణం

#minister ktr

మహానగర అభివృద్ధిలో భాగంగా స్కైవేల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ స్థలాలపై నాలుగేండ్లుగా స్పష్టత ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుండడం విచారకరమని పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు  అన్నారు. 

హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) పూర్తిచేసిన బాలానగర్​ ఫ్లై ఓవర్​ బ్రిడ్జిని మంగళవారం ఉదయం మంత్రులు కె.టి.రామారావు,  తలసాని శ్రీనివాసయాదవ్​, చామకూర మల్లారెడ్డి, కూకట్​ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు, మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. గత రెండేండ్లుగా బ్రిడ్జి పనుల్లో పాలుపంచుకున్న వనపర్తి జిల్లా మణిగల గ్రామానికి చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేత మంత్రి కేటీఆర్​ రిబ్బన్​ కత్తిరింపజేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు.

అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ సికింద్రాబాద్​ ప్యాట్నీ నుంచి సుచిత్ర చౌరస్తా వరకు, జూబ్లీ బస్​ స్టేషన్​ నుంచి ఔటర్​ రింగ్​రోడ్డు(ఓఆర్​ఆర)తుర్కపల్లి వరకు స్కైవేల  నిర్మాణానికి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంసిద్దంగా ఉన్నామని, దురదృష్ట వశాత్తు కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ కారణంగా వాటిని చేపట్టలేకపోతున్నామని మంత్రి కెటిఆర్​ విచారం వ్యక్తం చేశారు.

రక్షణ శాఖ(డిఫెన్స్​) భూములను అప్పగించే అంశంపై గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఎలాంటి  స్పష్టత రానికారణంగా ఆ రెండు చోట్ల స్కైవేల నిర్మాణాల్లో జాప్యం జరుగుతుందని మంత్రి వివరించారు. ఇప్పటికైనా కేంద్రం ముందుకు వచ్చి రక్షణ శాఖ స్థలాలను అప్పగిస్తే వెంటనే స్కైవేల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. 

కేంద్రం ముందుకు రాని పక్షంలో సుచిత్ర సర్కిల్​ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు సిద్దమని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. అదేవిధంగా బాచుపల్లి, కుత్బుల్లాపూర్​ రహదారుల విస్తరణ పనులు కూడా చేపడతామని హర్షధ్వనాల మధ్య మంత్రి కెటిఆర్​ ప్రకటించారు. 

ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్​ రావు ఆలోచనలకు లోబడి వ్యూహాత్మకం రహదారుల విస్తరణ కార్యక్రమం(ఎస్ఆర్​డిపి) కింద  రూ.30వేల కోట్ల ప్రణాళికలలో భాగంగా మొదటి దశలో రూ.6వేల కోట్లతో అండర్​ పాస్​ వేలు, బ్రిడ్జిల నిర్మాణాలు జరుగుతున్నాయని,   కూకట్​ పల్లి నియోజకవర్గంలోనే  వెయ్యి కోట్లకు పైగా  వ్యయంతో రహదారుల విస్తరణ, అండర్​ పాస్​ నిర్మాణాలు జరిగాయని,  ఇంకా కొన్ని పనులు ఎస్ఆర్​డిపి కింద జరుగుతున్నాయని మంత్రి వివరించారు. 

హైదరాబాద్​ ప్రజలకు మరింత మరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని,  జీహెచ్​ఎంసి, హెచ్ఎండిఏ లు సంయుక్తంగా కలిసి హైదరాబాద్​ మహానగరంలో బ్రహ్మండమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కెటిఆర్​ ప్రశంసించారు.

భారత ఉప ప్రధాన మంత్రి డాక్టర్​ బాబూ జగ్జీవన్​రాం వర్ధంతి సందర్భంగా ప్రారంభించుకున్న బాలానగర్​ ఫ్లై ఓవర్​ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్​ రాం పేరును ఖరారు చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్  ప్రకటించారు. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీచేస్తామని  తెలిపారు. 

బాలానగర్ ఫ్లై ఓవర్​ బ్రిడ్జి పనులను రూ.385 కోట్ల వ్యయంతో ప్రారంబించామని, స్థానిక ప్రజల కోరిక మేరకు రహదారుల విస్తరణను కొంత మేరకు తగ్గించుకోవడం వల్ల రూ.275 కోట్ల వ్యయంతో బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన నిధులతో పరిసరాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ది పనులు చేపడతామని మంత్రి కెటిఆర్ చెప్పారు. 

అంతకు ముందు మంత్రి కెటిఆర్​ తో పాటు అతిధులకు హెచ్ఎండిఏ సెక్రెటరీ సంతోష్​ సాదరంగా ఆహ్వానం పలికారు.  బాలానగర్​ ఫ్లై ఓవర్​ బ్రిడ్జి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన హెచ్ఎండిఏ చీఫ్​ ఇంజినీర్​ బిఎల్​ఎన్​ రెడ్డిని మంత్రి కెటిఆర్​ శాలువతో సన్మానించారు.  

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంబీపూర్​ రాజు, కె.నవీన్​ కుమార్​, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలత, ఫతేనగర్​ కార్పొరేటర్​ పి.సతీష్​గౌడ్​, బాలానగర్​ కార్పొరేటర్​ ఎ.రవిందర్​రెడ్డి లతో పాటు హెచ్ఎండిఏ, జీహెచ్​ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

గాల్వన్‌ లోయలో త్రివర్ణ పతాకం రెపరెపలు

Sub Editor

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కొత్త కమిషనర్

Satyam NEWS

ట్రంప్ పై నిషేధం ఎత్తేయబోతున్న ట్విట్టర్?

Satyam NEWS

Leave a Comment