చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వం బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్ పేర్కొన్నారు.
మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ఆర్ అండ్ బి ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు గొర్రెలు,బర్రెలు,చేపల, పథకాలు ప్రవేశపెట్టి మభ్య పెడుతున్నారని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీ వర్గాలకు విద్యా,ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు చేసి తీరా తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు.
3 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అధ్యక్షతన బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి 210 తీర్మానాలను ప్రవేశ పెట్టి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. అధికారంలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు బీసీ ల సమస్యలపైన గళమెత్తాలని ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాలు భర్తీ చేయకుండా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మేధావులు బీసీ లందరూ రాజ్యాధికారం కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీసీ నాయకులు నిరంజన్,మధు కాంత్,అజయ్ గౌడ్,లక్ష్మయ్య గౌడ్,భాస్కర్, శివ,అంజి యాదవ్, జంగయ్య యాదవ్,వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.