38.2 C
Hyderabad
April 29, 2024 22: 14 PM
Slider ప్రత్యేకం

టీడీపీతో పొత్తుకు నో అంటున్న కమలనాథులు

#telugudesham

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని బి‌జే‌పి నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు  రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్‌చార్జు లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు అధిష్టానం పెద్దలకు వివరించారు.  పార్టీ అధ్యక్షుల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్‌చార్జు లు సునీల్‌ దియోధర్,  మధుకర్‌ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది.

రెండు రోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలులోని మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్‌ హాలులో ఇటీవల నిర్వహించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ సుప్రకాశ్, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్, మధుకర్,  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, పదాధికారులు పాల్గొన్నారు. సమావేశం హాలులోకి మీడియాను కూడా అనుమతించలేదు. సమావేశం తర్వాత కూడా విషయాలను బయటికీ వెల్లడించలేదు. అయితే సమావేశానికి హాజరైన బీజేపీ ముఖ్యనేతల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

బిజెపితో కలుస్తారు…. అధికారం వెలగబెడతారు….

బీజేపీ విధానం, పార్టీ బలోపేతం, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సిద్ధం కావడంతో పాటు పొత్తు అంశాలపై చర్చించారు. చంద్రబాబునాయుడు బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బీజేపీతో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని 13 జిల్లాల అధ్యక్షులు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బీజేపీతో జతకట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారని చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండకూడదని 13 జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడిగా నిర్ణయించారు.

పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు ఉండదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఆపార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరని, కేవలం పొత్తులపై మైండ్‌గేమ్‌ ఆడుతున్నారన్నారు.

జనసేనకు స్థిరమైన నాయకత్వం లేదు……

జనసేనతో కూడా పొత్తులపై ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేమని, పవన్‌కల్యాణ్‌తో పాటు జనసేన నేతల్లో స్థిరమైన నాయకత్వం లేదని, అలాంటివారిని నమ్మి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లలేమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.  బీజేపీ ఇన్‌చార్జు లతో పాటు రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుల నుంచి సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తోంది. జాతీయపార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలవలేదంటే పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవడమే కారణమని తేల్చిచెప్పినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్ననేతలే బీజేపీలో ఉన్నారని, వారు బీజేపీ కాకుండా టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని ఓ వ్యక్తి  ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది.

సీఎం రమేశ్, సుజనా చౌదరి టీడీపీలో ఎంత క్రియాశీలకంగా పనిచేశారో, చంద్రబాబుకు, వారికి మధ్య ఉన్న ధృడమైన బంధం ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో వారు బీజేపీలో చేరారో అందరికీ తెలిసిందేనని , ఇలాంటి వ్యక్తుల మాటలు విశ్వసించి పార్టీలో నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని సునీల్‌ దియోధర్‌తో పాటు సుప్రకాశ్‌కు పలువురు అధ్యక్షులు వ్యక్తిగతంగా కలిసి వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మురళీ కృష్ణ తాళ్లూరి, సత్యంన్యూస్.నెట్

Related posts

డాక్టర్ అనితా రెడ్డి కి ఉమెన్ ఎక్స్ లెన్సి -2023 అవార్డు

Satyam NEWS

నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు బెదిరింపులు

Satyam NEWS

బీ ఇండియన్: కరోనా కొట్టేద్దాం ‘ఆయుష్’ పెంచుకుందాం

Satyam NEWS

Leave a Comment