40.2 C
Hyderabad
April 29, 2024 17: 51 PM
Slider నిజామాబాద్

ఈ నెల 18 న బీజేపీ కౌన్సిలర్ల రాజీనామా..?

#bjp

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 12 న భవిష్యత్ కార్యాచరణ సమావేశాన్ని లింగాపూర్ గ్రామంలో నిర్వహించారు. ఆ రోజు రైతుల ఏకాభిప్రాయం మేరకు ఈ నెల 20 లోపు విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్ రద్దుకు మద్దతిస్తూ రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అదే రోజు బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తాము రైతుల కోరిక మేరకు ఎప్పుడైనా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

అయితే రైతులు ఇచ్చిన డెడ్ లైన్ కు ముందే బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. లింగాపూర్ గ్రామానికి చెందిన 11 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్, రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన 2 వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి ఈ నెల 18 న రాజీనామా చేయనున్నారు. బీజేపీ కౌన్సిలర్ల రాజీనామా అనంతరం మిగతా కౌన్సిల్ సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చేలా ప్లాన్ చేయడానికి వీలు కలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అవసరం అయితే ఈ ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే కాకుండా బీజేపీకి చెందిన మిగతా ఐదుగురు కౌన్సిలర్లు సైతం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే రైతుల సమక్షంలోనే ప్రకటించారు.

బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిర్ణయమేంటి..?

బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రాజీనామా చేస్తే మిగిలిన ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఇంకా తెలియరాలేదు. ఎమ్మెల్యే సూచన మేరకు నిన్న విలీన గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు మిగతా కౌన్సిలర్లు రైతులతో సమావేశమై రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే విలీన గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు కాకుండా పార్టీ ముఖ్య నాయకులు వెళ్లి రైతులతో చర్చించారు. విలీన గ్రామాలకు ఏమాత్రం సంబంధం లేని మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు, ఇతర నాయకులు రైతులతో సమావేశమయ్యారు. టెక్రియల్ కౌన్సిలర్ రైతులకు మద్దతుగా ఉంటానని చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే 1 వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది రాణి మహేష్ మున్సిపల్ కమిషనర్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. లింగాపూర్ గ్రామంలో సమావేశానికి వెళ్లిన వారిలో దేవునిపల్లికి చెందిన 10 వ వార్డు కౌన్సిలర్ భర్త కాసర్ల స్వామి, 35 వ వార్డు కౌన్సిలర్ కృష్ణాజిరావు లను రాజీనామాపై విలేకరులు అడగ్గా మేమెందుకు రాజీనామా చేస్తామని, తమను గెలిపించిన ఓటర్లు తమ రాజీనామాను కోరలేదని, కోరితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పడం గమనార్హం. విలీన గ్రామాలకు సబందం లేని వైస్ చైర్మన్ 100, 80 ఫీట్ల రోడ్లు తొలగించేలా చేస్తామని హామీ ఇస్తూ లేఖ రాసివ్వడం వెనక ఆంతర్యం ఏమిటనేది చర్చ కొనసాగుతోంది.

ఆ గ్రామానికి చెందిన పడిగే సుగుణ అక్కడే ఉన్న ఆమె రైతులకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం, ఆమె స్థానంలో వైస్ చైర్మన్ లెటర్ రాసివ్వడం, ఎవరో పొలిటికల్ లీడర్ చెప్తే తాము ఎందుకు రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు సమాధానం ఇవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. మొత్తం మీద విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామా అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారనుంది. బీజేపీ కౌన్సిలర్లు తప్ప బీఆర్ఎస్ కు చెందిన విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. దాంతో 20 వ తేదీ తర్వాత రైతుల కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠగా మారనుంది.

Related posts

ఇర్రెగ్యులారిటీ: అర్హులకు దక్కని ఇళ్ల స్థలాలు

Satyam NEWS

వ్యాక్సిన్ వేయించుకున్న వారికి వాట్స్ యాప్ ద్వారా సర్టిఫికెట్

Satyam NEWS

విద్యార్ధినిలకు నారాయణపేట్ జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment