29.7 C
Hyderabad
May 1, 2024 06: 02 AM
Slider ఖమ్మం

కార్పొరేట్‌ బానిసత్వమే బీజేపీ లక్ష్యం

#CPI(M) and CPI State Secretariat members

కార్పొరేట్‌ బానిసత్వమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతుందని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు, బాగం హేమంతరావు ఆరోపించారు. ఆధిపత్య భావజాలం ముందుకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. పూలే జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక మంచికంటి మీటింగ్‌ హాల్లో సిపిఐ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రసంగించారు.

సామాజిక సంస్కరణల నాందికర్త, మానవతావాది జ్యోతిరావు పూలే సిద్ధాంతం స్ఫూర్తిదాయకం అన్నారు. భారతదేశానికి ఉన్న ఆణి ముత్యాల్లో జ్యోతిరావు పూలే ఒకరని పేర్కొన్నారు. దేశంలో కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారన్నారు. మనువాద గులాం గిరీని రద్దు చేయడానికి ఆధునిక భారతదేశ చరిత్రలో పోరాడిన తొట్ట తొలి వ్యక్తి పూలే అని చెప్పారు. కులాధిపత్యాన్ని నిర్మూలించడానికి పోరాటం కొనసాగించాలని ప్రతినబూనాడన్నారు.

శూద్రులు, అతిశూద్రుల పై అగ్రవర్ణాలవారు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి పూలే 1873 సెప్టెంబరు 24న ‘సత్య శోధక్‌ సమాజ్‌ ను స్థాపించాడని చెప్పారు. మెజారిటీగా ఉన్న నిమ్నవర్గాల ప్రజలను కులదోపిడీ నుంచి విముక్తి చేయడంతోపాటు రైతులు, కూలీలను తమ హక్కుల కోసం సంఘటితపరిచేందుకు ఈ సంస్థ ద్వారా పూలే విశేషంగా కృషి చేశాడని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కృత్రిమ కుల వ్యవస్థను సృష్టించి, దేశంలోని మెజారిటీ వర్గాలను ఆర్ధికంగా, సామాజికంగా అణచివేసిన స్వార్థపర వర్గాల దోపిడీని జీవితాంతం వ్యతిరేకించి పోరాడిన మహానుభావుడు పూలే అన్నారు. ఆయన నడిపిన పోరాటాల స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ దేశపు వెనుకబాటుతనానికి ప్రధాన కారణమైన కులవ్యవస్థ నికృష్ట స్వభావం గురించి చాటిచెప్పాడని తెలిపారు. మహిళా జనోఉద్ధరణ కోసం పాటుపడిన మహనీయుడు పూలే అని తెలిపారు. మహిళా చైతన్యం కోసం ఆయన భార్య సావిత్రిబాయి పూలే చేత దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను నెలకొల్పాడని చెప్పారు. ఏ మూఢనమ్మకాలు, ఏ మతమౌఢ్యం పైనైతే జ్యోతిరావు పూలే పోరాడారో, తిరిగి వాటిని ఆచరణలోకి తెచ్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూనుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే మతం పేరుతో శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా బిజెపి, దాని అనుబంధ సంస్థలు ర్యాలీలు నిర్వహిస్తూ చర్చిలు, మసీదులపై దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు.

సామాజిక కోణంలోనే కాకుండా ఆర్థిక, మతపరమైన దాడులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. వీటన్నింటి నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందన్నారు. సీపీఐ జిల్లా నాయకులు శింగు నరసింహారావు, సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్‌ మాట్లాడారు. సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, వై.విక్రమ్‌, సీపీఐ జిల్లా నాయకురాలు సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకాశం జిల్లా దరిశి లో మేడే ఎర్రజెండాలు ఆవిష్కరణ

Satyam NEWS

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నేపథ్యంలో జడ్జిల దూషణ కేసులో మరి కొందరి అరెస్టు

Satyam NEWS

దళిత రత్న అవార్డుల ప్రధాన ఉత్సవం

Bhavani

Leave a Comment