ఆంధ్రప్రదేశ్ లో ఇక రేప్ చేస్తే మరణశిక్ష విధించేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కి చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టరూపంలోకి తీసుకువచ్చిన తర్వాత ఏపిలో రేప్ చేస్తే మరణ శిక్ష విధిస్తారు. అదే విధంగా నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువరించాలని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టులో ప్రవేశపెడితే మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది.
ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ ఈ బిల్లు ను రూపొందించారు. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించడమే కాకుండా అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు విచారణకు ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే చర్యలు తీసుకుంటారు. సెక్షన్ 354 (ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలు పొందుపరిచారు. మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు.
మెయిల్, సోషల్‌మీడియా, డిజిటిల్ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ చర్యలు తీసుకుంటారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్) కింద చర్యలు తీసుకుంటారు. అదే విధంగా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. పోస్కో చట్టం కింద ఇప్పటివరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష మాత్రమే విధించే అవకాశం ఉంది. ఈ శిక్షను పెంచుతూ బిల్లులో అంశాలు పొందు పరచగా దానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.