29.7 C
Hyderabad
May 3, 2024 05: 31 AM
Slider సంపాదకీయం

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ?

#YS Jagan Mohan Reddy

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనే వార్తలు వైసీపీ మంత్రుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో నలుగురికి ఉద్వాసన పలుకుతారని కూడా చర్చించుకుంటున్నారు.

రెండున్నర సంవత్సరాలకు ఒక బ్యాచ్ ఆ తర్వాత మరొక బ్యాచ్ మంత్రులు ఉంటారని, అందరికి అవకాశం వస్తుందని ముందుగా చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మరో మారు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ మాట ఎత్తడం పలువురిని ఆశ్చర్య పరుస్తున్నది. ఎన్నికల వరకూ తామే మంత్రి పదవుల్లో కొనసాగుతామని ఆశించిన వారికి ఇప్పుడు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా అయింది. గత మంత్రి వర్గంలో మాదిరిగానే ఇప్పటి మంత్రి వర్గంలో కూడా ఒకరిద్దరు తప్ప తమ శాఖలపై పట్టు సాధించుకోలేదు. తమ శాఖలపై ఏ మాత్రం పట్టు సాధించని మంత్రులే ఎక్కువ మంది ఉండటంతో అధికారుల రాజ్యం నడుస్తున్నది.

తమ తమ శాఖల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటే ఎక్కడ చిక్కులు వస్తాయోననే కారణంగా మంత్రులు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. దాదాపుగా అన్ని శాఖలనూ ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తున్నది. అధికారులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సూచన రాకపోతే ఏ పనీ చేయడం లేదు. దాంతో మంత్రులు అందరూ కూడా డమ్మీలుగానే మారి ఉన్నారు.

అధికారులు మాత్రం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం లోని అధికారులతో టచ్ లో ఉంటూ శాఖలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద చిల్లి గవ్వ లేకపోవడంతో అధికారులు కూడా గత రెండున్నర సంవత్సరాలుగా ఏ పనీ చేయడం లేదు. డబ్బులు ఖర్చు చేయాల్సిన శాఖలు నిద్రపోతుండగా డబ్బులు సంపాదించే శాఖలు డైరెక్షన్ లేకుండా తయారయ్యాయి. దాంతో ప్రభుత్వ యంత్రాంగం దాదాపుగా కుంటుపడింది.

అధికారులే అచేతనంగా ఉండటం, అవసరం అయిన పనులను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం సూచన మేరకు మాత్రమే చేయడం అలవాటు చేసుకున్న అధికారులు సంబంధిత శాఖల మంత్రులను లెక్క చేయడం లేదు. మంత్రులు కూడా రాజకీయ వ్యవహారాలకే పరిమితమయ్యారు తప్ప పరిపాలనాసంబంధిత అంశాలలో వారి జోక్యం లేకుండా పోయింది.

సరే ఏదోక విధంగా మంత్రి పదవి అయితే ఎన్నికల వరకూ ఉంటందని అంచనా వేసుకున్న వారికి ఇప్పుడు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ మాట నిద్ర పట్టనివ్వడం లేదు. అంతే కాకుండా నలుగురినో ఐదుగురినో తీసేస్తారని గుసగుసలు వినిపిస్తుండటంతో అందరిలో ఆందోళన నెలకొని ఉంది. చంద్రబాబునాయుడిని, లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించి కమ్మ కుల పెద్దలకు దూరం అయిన కొడాలి నాని లాంటి వారిని కూడా కొనసాగనివ్వకుండా జగన్ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మంత్రిపదవి కోల్పోయిన కొడాలి నాని అటు సొంత కులానికి కూడా దూరం అయ్యారు. ఇటు మంత్రి పదవి కూడా పోయింది. పార్టీకి ఎంతో విధేయంగా పని చేస్తున్న పేర్ని నాని విషయంలో కూడా ముఖ్యమంత్రి కనికరించలేదు. ఆయనకు కూడా మంత్రి పదవి పీకేశారు. అదే విధంగా కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారి మంత్రి పదవులు కూడా తీసేశారు.

అలాంటిది ఇప్పుడు తమపై కనికరం చూపిస్తారని ఆశించడం కూడా తప్పేనని ప్రస్తుత మంత్రులు అనుకుంటున్నారు. ఎన్నికల ముందు పదవి పోతే నియోజకవర్గంలో గెలవడం కూడా కష్టం అవుతుందని మంత్రి పదవి కోల్పోయే వారు భావిస్తున్నారు. మంత్రి పదవి కోల్పోయే వారు ఎవరో ఇప్పటికీ స్పష్టం కాలేదు. అయితే అందరిలో గుబులు మాత్రం బయలుదేరింది.

Related posts

నల్లమల రేంజ్ పరిధిలో అక్రమ కలప స్వాధీనం

Satyam NEWS

చైనాలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు…..

Satyam NEWS

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రార్ధనా మందిరాలు బంద్

Satyam NEWS

Leave a Comment