ఛలో ఆత్మకూరు ఇప్పుడు అడ్డుకున్నా.. పార్టీ మాత్రం బాధితుల పక్షాన నిలబడతామని చంద్రబాబు స్పష్టం చేసారు. ఛలో ఆత్మకూరు రగడ కొత్త మలుపు తీసుకుంది. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు నిరాకరించటంతో చంద్రబాబును..లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీనికి నిరసనగా చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు నిర్ణయించారు. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ ను ఖండించారు, బాధితులకు ఆహారం వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు దిగారు. ఉదయం 8 గంటలకు తన నివాసంలో ప్రారంభించిన దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తంగా దీక్షలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు, అండగా అందరూ నిరసనల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను చేస్తున్న దీక్ష సమయంలోనే టీడీపీ నేతలంతా ప్రతీ ప్రాంతంలో తమ వంతుగా దీక్షలు చేయాలని కోరారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫిరెన్స్ లో చంద్రబాబు ఈ సూచనలు చేసారు. చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. చంద్రబాబు ఇంటి వద్దకు ఎవరినీ అనుమతించటం లేదు. కీలక నేతలు మాత్రమే ఆయన్ను కలవటానికి వెళ్లారు. తెలుగు విద్యార్ది నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి లోకేశ్ ను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరుకు వెళ్లనీయకుండా మాజీ మంత్రులు..పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. చలో ఆత్మకూరుకు అనుమతి లేదని..చంద్రబాబు కార్యక్రమం ఉప సంహరించుకోవాలని పోలీసులు సూచించారు.