February 28, 2024 09: 08 AM
Slider సంపాదకీయం

ఈ సారి పులివెందులలో జగన్ కు కష్టమే…

#pulivendula

పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి బీటెక్ రవి కి వస్తున్న స్పందన చూసి సీఎం జగన్ భయపడుతున్నారా? ఎప్పుడో పది నెలల కిందట జరిగిన ఒక చిన్న సంఘటనపై ఇప్పుడు తీవ్రంగా స్పందించి పోలీసులను ఉపయోగించి రవిని అక్రమంగా అరెస్టు చేయించిన తీరు చూస్తే ఈ ప్రశ్న నిజమే అనిపిస్తున్నది.

పోలీసులు ఎంతో ఉత్సాహంగా రాత్రి చలిలో కూడా కాపు కాసి దొంగల్లాగా ఒక మనిషిని ఎత్తుకుపోవడం ఏమిటో అర్ధం కాదు. బీటెక్ రవిపై నేరారోపణ ఉంటే దాన్ని ధైర్యంగా ముందే చెప్పి పోలీసులు అరెస్టు చేయవచ్చు. రాత్రి పూట కాపు కాయటమేమిటి? నిర్మానుష్య ప్రదేశంలో అరెస్టు చేయడం ఏమిటి? ఇలా దొంగ చాటుగా ఒక మనిషిని అరెస్టు చేశారు అంటే ఆ మనిషి అంటే వాళ్ల పొలిటికల్ బాస్ కు ఎంత భయమేస్తున్నదో అని సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఇంతకీ బీటెక్ రవి చేసిన నేరం ఏమిటో తెలుసా? పది నెలల కిందట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడపకు వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఏఎస్ఐకు గాయాలయ్యాయని లేటెస్టుగా పోలీసులకు గుర్తొచ్చింది. వాళ్లకు గుర్తుకు వచ్చిందో పొలిటికల్ బాస్ లు గుర్తు చేశారో తెలియదు కానీ మొత్తానికి కేసు పెట్టేశారు. పదినెలల కింద తోపులాట జరిగితే కిడ్నాప్ తరహాలో బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేయడం ఏ కోవకు వస్తుందో ప్రజలే అర్ధం చేసుకోవాలి.

పోలీసులు రాత్రి పూట ఫోన్లు ట్యాప్ చేసి.. నిఘా పెట్టి ప్రయాణంలో ఉన్న ఆయనను నిర్మానుష్య ప్రాంతంలో అరెస్టు చేశారు. ఏ కేసులో అరెస్టు చేశారో.. ఎందుకు చేశారో.. అసలు పోలీసులు చేశారో లేదో ఎవరికీ తెలియదు. మీడియాలో కిడ్నాప్ అనే ప్రచారం జరిగిన తర్వాత ఓ పోలీస్ స్టేషన్ నుంచి మేమే అరెస్టు చేశామన్న సమాచారం ఇచ్చారు.

ఆ తోపులాటలో గాయపడ్డ ఆ ఏఎస్‌ఐ ఫిర్యాదుతోనే వెంటనే నాన్ బెయిలబుల్ కేసుగా మార్చేసి అరెస్టు చేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు కేసు విషయం విచారణకు వచ్చినప్పుడు నాలుగు రోజులు ఆలస్యంగా కేసు పెడితేనే సుప్రీం తీవ్రంగా స్పందించింది. ముందస్తు బెయిల్ ను సమర్థించింది. ఇక్కడ పది నెలలు ఆలస్యమైనా .. దిగువకోర్టు రిమాండ్ కు పంపింది. అసలు ముందుగా దిగువకోర్టు జడ్జి బుధవారం కోర్టు ముందు హాజరు పరచాలన్నారు. కానీ తర్వాత రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.

అరెస్టు చేయడానికి పది నెలలు ఎందుకు ఆలస్యమయిందంటే… బీటెక్ రవి అందుబాటులో లేరని పోలీసులు చెబుతున్నారు. ఆయన ఎప్పుడూ పులివెందులలోనే ఉంటారు. ఇటీవల పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అందుబాటులో లేరని చెప్పడానికి ఒక్కనోటీసు అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. ఈ విషయంలో పోలీసులు ప్రతీ చట్టాన్ని… బీటెక్ రవి ప్రతి హక్కునూ ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నది.

అచ్చమైన అరాచకపాలనకు స్పష్టమైన చిరునామా పోలీసు వ్యవస్థ ప్రైవేటు సైన్యంగా మారింది.. కేసుల పేరుతో కిడ్నాప్‌లకు పాల్పడి.. పాలకుల రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష ఇంచార్జుల్ని.. అరెస్టు చేసి.. వారు ప్రజల్లోకి వెళ్లకుండా చేసి.. గెలిచేయాలని .. ఓట్ల జాబితాల్లో అక్రమాలను ప్రశ్నించకూడదని అనుకుంటోంది. దీనికి పోలీసు వ్యవస్థ ఓ ప్రైవేటు సైన్యంలా మారింది. అరాచక పాలనకు అచ్చమైన చిరునామాగా ఏపీ మారింది.

ఒక్క రోజు ముందే కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఎవరో ఎవరిపైనో దాడి చేస్తే వాళ్లు ప్రవీణ్ రెడ్డి అనుచరులు అని ఆయనపై కేసు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ రాజకీయ కారణాలతో తప్పుడుకేసులు పెట్టడం.. నియోజకవర్గ స్థాయి నేతల్ని అర్థరాత్రుళ్లు అరెస్టు చేయడం పరిపాటిగా మారింది. పులివెందులలో సీఎం జగన్‌కు ప్రత్యర్థిగా ఉన్న బీటెక్ రవిని అరెస్టు చేసిన విధానం… ఆయనపై పెట్టిన కేసును చూస్తే.. మన రాష్ట్రంలో పోలీసింగ్ అనేది ఒకటి ఉందా .. లేక ప్రైవేటు సైన్యం ఏమైనా పరిపాలిస్తుందా అన్న అనుమానం రాకమానదు.

బీటెక్ రవి అరెస్టు తో పులివెందుల నియోజకవర్గంలో ఆయన పట్ల సానుభూతి పవనాలు వీస్తున్నాయి. గతంలో ఒక సారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పులివెందుల పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన సాధారణ విషయాలు ప్రస్తావిస్తున్నారు. అయితే సభలో పాల్గొన్న వారు బాబాయి హత్య, గొడ్డలి వేటు…. అంశాలు మాట్లాడాలని చంద్రబాబునాయుడిపై వత్తిడి తీసుకువచ్చారు. అక్రమ మద్యం కేసులు ఏ విధంగా పెడుతున్నారో చెప్పమని చంద్రబాబునాయుడిని అడిగి మరీ చెప్పించుకున్నారు.

ఈ విధంగా పులివెందులలో తెలుగుదేశం పార్టీ అనుకూల పవనాలు కనిపించాయి. ఈ సారి వై ఎస్ జగన్ పులివెందుల నుంచి ఓడిపోయేంత బలంగా అక్కడ గాలి వీస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీటెక్ రవి అరెస్టు జరిగిందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. బీటెక్ రవి అరెస్టుతో ఇక ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్నారు.

Related posts

చదువుల తల్లికి క్లాస్ మెట్ క్లబ్ ఆసరా

Satyam NEWS

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న విజయనగరం ఎస్పీ…!

Satyam NEWS

కడప జిల్లాలో ఏటీఎం ల దొంగ అరెస్ట్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!