32.2 C
Hyderabad
May 2, 2024 02: 08 AM
Slider సంపాదకీయం

ఛలో విజయవాడ: చెలరేగిన ఎన్నో ప్రశ్నలు….

#chelloVijayawada

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం జగన్ ప్రభుత్వం పై పెను ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎవరూ ఇంత పెద్ద ఆందోళన చేయలేదు.

ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ జరగలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పిలుపునివ్వడం దాన్ని విజయవంతం చేయడంతో ఒక్క సారిగా జగన్ ప్రభుత్వానికి వాస్తవం ఏమిటో అర్ధం అయి ఉంటుంది. విజయవాడ వీధులను పోలీసులు దిగ్బంధించినా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేసినా కూడా ఛలో విజయవాడ పూర్తి స్థాయిలో విజయవంతం అయింది.

లక్ష మందికి పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవాడకు తరలి రావడం అంటే మాటలు కాదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలపై తీవ్ర నిర్భందం కొనసాగింది. పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

ఎక్కడికక్కడ వాహనాలను నిలుపుదల చేశారు. విజయవాడ వైపు వచ్చే బస్సులను కూడా తనిఖీ చేసి టీచర్లు ఉన్నారేమోనని గుర్తింపు కార్డులు కూడా తనిఖీ చేశారు. అయినా…. లక్ష మంది విజయవాడలో గుమికూడారంటే దాని అర్ధం ఏమిటి? ఇది ఎవరో ఒకరు తలచుకుంటే జరిగేది కాదు.

ప్రభుత్వం పిఆర్ సి పై చేస్తున్న వితండవాదనలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన సమాధానం. ప్రజలకు ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేసింది. ఉద్యోగులకు వ్యతిరేకంగా ఊరూరా కరపత్రాలు పంచిపెట్టారు. ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా విద్యార్ధులతో చెప్పించారు.

ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీ నాయకులు చాలా చోట్ల బహిరంగ సభలు పెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయులను కించపరచే విధంగా మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదించేందుకు కూడా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు.

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ పై సానుకూలంగా స్పందించడం అటుంచి తీవ్ర వ్యతిరేక వైఖరిని ప్రభుత్వం అమలు జరిపింది. సమ్మె నోటీసు ఇచ్చారు కదా ఇప్పుడు ఛలో విజయవాడ ఎందుకు? అంటూ ప్రభుత్వ పెద్దలు కూనిరాగాలు తీశారు.

ఉవ్వెత్తున కదలి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకోలేకపోయారు. పోలీసులు వారిని ఉదారంగా వదిలేసినట్లు ఇప్పుడు కొందరు చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే ఇక జగన్ ప్రభుత్వం పోలీసు బలగాలను విచ్చలవిడిగా, గతంలో అందరి పైనా ప్రయోగించినట్లు ఇకపై ప్రయోగించడానికి అడ్డంకులు ఎదురవుతాయి.

పోలీసు ఉన్నతాధికారులు పై నుంచి కఠినాతికఠినమైన ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయిలో పోలీసు సిబ్బంది అన్యమనస్కంగా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఛలో విజయవాడ కార్యక్రమం నిరూపించింది. పోలీసు బలగాలను ‘‘సమర్ధంగా’’ వినియోగించుకోలేని స్థితికి ప్రభుత్వం వచ్చేస్తే ఇక నిరంకుశంగా నిర్బంధం అమలు చేయడం కుదరకపోవచ్చు.

ఇది ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నది ఒక్కటే దారి…. ఎన్జీవో సంఘాలలో ఉన్న తమ కోవర్టులను నమ్ముకోకుండా ఉద్యోగులు ఏమడుగుతున్నారో సానుకూలంగా ఆలోచించాలి. ఎన్జీవో సంఘాలను ఎలా చీల్చాలో ఆలోచించకుండా వారి సమస్యలు పరిష్కరించే దిశగా చూడాలి.

ఎన్జీవో సంఘాలలోని కోవర్టులు ఇప్పుడు సమ్మెను నీరుగార్చలేని దుర్భర స్థితికి చేరిపోయారు. అందువల్ల వారిని నమ్ముకోవడం వల్ల ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ ఉండదు. సమ్మె ప్రారంభం అయ్యే లోపు వారి డిమాండ్లు పరిష్కరించడం మంచిది. అప్పుడు మళ్లీ వారే జగన్ ఫొటోలకు పాలాభిషేకం చేస్తారు.

Related posts

సుమన్ హీరోగా శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో ‘మహరాజు’

Satyam NEWS

దేశం నగుబాటుకు జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చు

Satyam NEWS

సేఫ్ హ్యాండ్స్: ప్రజల భరోసా భద్రత కోసమే కార్డన్ అండ్ సెర్చ్

Satyam NEWS

Leave a Comment