33.7 C
Hyderabad
April 29, 2024 01: 43 AM
Slider ప్రత్యేకం

కాపు రిజర్వేషన్లపై నోరు మెదపకపోతే ఎలా సారూ?

#RRR fresh letter

ఆర్ధికంగా వెనుబడిన వర్గాల పేరుతో ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో సగం కాపు కుల వర్గాలకు ఇవ్వాలనే నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రఘురామకృష్ణంరాజు లేఖ పూర్తి పాఠం ఇది:

ముఖ్యమంత్రి గారూ,

సామాజిక వెనుకబాటుతనం విద్యా విషయాలలో వెనుకబాటుతనానికి దారితీస్తుంది. ఈ రెండూ కలిసి పేదరికం వైపు తీసుకెళతాయి. దేశంలో ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్నది ఇదే. సామాజిక వెనుకబాటుతనం, విద్యా విషయాల్లో వెనుకబాటుతనం, పేదరికం అనేవి ఒకదాన్ని మరొకటి పెంచుకుంటూ ఒక విషవలయంగా మారాయి. (1992లో ఇందిరా సాహ్నీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి)

మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రోజునే, అంటే ఈ నెల 18న, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,143 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆమోదముద్ర వేసింది. వీటిలో ఎస్ సి, ఎస్ టి, బ్యాక్ లాగ్ పోస్టులను మినహాయిస్తే సుమారుగా 9000 పోస్టులు ఉంటాయి. వీటిలో 10 శాతం పోస్టులు అంటే 900 పోస్టులు ఆర్ధికంగా బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగులైన యవతకు దక్కాల్సి ఉంది. మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ గత రెండు సంవత్సరాలలో మొత్తం 6.03 లక్షల పోస్టులను మన ప్రభుత్వం భర్తీ చేసినట్లుగా చెప్పారు. ప్రభుత్వంలో ఇటీవల విలీనం అయిన ఏపిఎస్ఆర్ టిసి కి చెందిన ఉద్యోగులను దీనిలో నుంచి తీసేస్తే మన ప్రభుత్వం సుమారుగా 5.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లుగా చెప్పుకోవచ్చు. ఇందులో గ్రామ కార్యదర్శుల పోస్టులు 1,21,518 కాగా వాలంటీర్ ఉద్యోగాలు 2,59,565 ఉన్నాయి. కరోనా అత్యవసర పరిస్థితిలో మరో 26,325 మందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. OPCOS ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా 96,212 మందిని ఉద్యోగాలలో తీసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా మీరు చేసిన ఈ అన్ని రకాల నియామకాలలో ఆర్ధికంగా వెనుకబడిన నిరుద్యోగ యువకులు తమకు వాటాగా రావాల్సిన ఉద్యోగాలను కోల్పోయారు. ఇదే అంశంపై ప్రముఖ దినపత్రిక అయిన ఈనాడులోనూ, కొన్ని టీవీ ఛానెళ్లలోనూ కూడా కూలంకషంగా వార్తావిశ్లేషణలు వెలువడ్డాయి. ఆర్ధికంగా వెనుకబడిన నిరుద్యోగ యువత నుంచి నాకు ఎన్నో వినతిపత్రాలు వస్తున్నాయి. నాలాగానే చాలా మంది ప్రజా ప్రతినిధులకు కూడా వినతి పత్రాలు అందుతున్నాయని తెలిసింది. మీకు మాత్రం ఇలాంటి వినతి పత్రాలు అందే అవకాశం లేదు.

మన రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కేవలం విద్యా సంస్థలలో మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నాము. మీరు ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సమయంలో కూడా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఐదు శాతం, అదే విధంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సమూహమైన కాపు కులస్తులకు మరో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ (103 అధికరణ సవరణ) చట్టం 2019 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న రెండు చట్టాలపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిన తదనంతర పరిణామాలలో ఎలాంటి నిర్ణయాత్మక పని జరగలేదు. కేవలం విద్యా సంస్థలలో, అదీ కూడా మైనారిటీ విద్యా సంస్థలను మినహాయించి మాత్రమే EWS రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 2019 జులై 27న జీవో నెం 60 ని విడుదల చేసింది.

ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి మరో ప్రత్యేక జీవో విడుదల చేస్తామని అదే జీవోలో ప్రస్తావించారు కానీ ఈ రోజు వరకూ ఆ పని జరగలేదు.

నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నది ఏమిటంటే మీరు తక్షణమే ఉద్యోగాలలో కూడా EWS రిజర్వేషన్లను అమలు చేసేందుకు చర్యలు తీసుకోండి. మరింత స్పష్టత కోసం న్యాయస్థానాలను అభ్యర్ధించండి. మనం చాలా విషయాల పైన అవసరం ఉన్నా లేకున్నా కోర్టులకు వెళుతున్నామని ప్రజలు అనుకుంటున్నారు. అత్యవసరమైన, అతి ముఖ్యమైన ఈ అంశంపై కోర్టులకు ఎందుకు వెళ్లడం లేదని కూడా ప్రజలు మనల్ని అపార్థం చేసుకునే అవకాశం కనిపిస్తున్నది. మనమే కనుక తదుపరి చర్యల కోసం, తదుపరి స్పష్టత కోసం న్యాయస్థానాలకు వెళితే ఒక్క కాపు కుల సమూహంలోనే కాదు మిగిలిన అన్ని EWS కులాల వారిలోనూ మనపై విశ్వాసం పెరుగుతుంది. రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగే కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలలోనూ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలోనూ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తే మరింత బాగుంటుందని నేను ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నాను.

103వ అధికరణకు సవరణలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను విభజించడం రాజ్యాంగ విరుద్ధమని మాత్రమే ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ కోర్టులో పేర్కొన్నారు. 10 శాతం కోటాను ఇలా విభజించడం చట్ట సవరణ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని మాత్రమే ఆయన కోర్టులో వాదించారు. అయితే రాష్ట్రంలో ఈ రెండు జీవోలను అమలు చేయకుండా హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదని నేను మీకు సవినయంగా తెలియచేసుకుంటున్నాను. EWS వారి కి విద్యాసంస్థల్లో ఈ చట్టం వర్తింపచేయడానికి మాత్రమే కోర్టు తాత్కాలిక సూచనలు చేసింది.

రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరిస్తూ 103వ రాజ్యాంగ సవరణ తీసుకురావడంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని, అందువల్ల అక్కడ ఈ కేసుపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ తాము నిర్ణయం తీసుకోలేమని మాత్రమే రాష్ట్ర హైకోర్టు తెలిపింది. అదే విధంగా కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేయకుండా కూడా తాము ముందుకు వెళ్లలేమని స్పష్టం చేసింది.

దాఖలైన రిట్ పిటిషన్ పై వెలువడే తుది ఆదేశాల ఆధారంగానే విద్యాసంస్థల్లో EWS రిజర్వేషన్ల అమలు అంశం ఆధారపడి ఉన్నా కూడా ఈ అంశంలో మరే రాయితీని తాము కోరేది లేదని, హైకోర్టు తుది తీర్పునకు లోబడి అప్పటి వరకూ ఇచ్చిన ఆదేశాలను సవరించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉంది.

ఈ అంశాల ఆధారంగా మన ప్రభుత్వం విద్యాసంస్థల్లో EWS రిజర్వేషన్లు అమలు చేస్తూ, ఉద్యోగాలలో మాత్రం నిలుపుదల చేసింది. అందువల్ల నేను మిమ్మల్ని కోరుతున్నది ఏమిటంటే ఈ అంశంలో అవసరమైన సత్వర చర్యలు తీసుకోండి. తక్షణమే కాపు కులస్తులకు ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్ ను అమలు చేయండి. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాలలో కాపుకులస్తులే 50 శాతం మేరకు ఉంటారు కాబట్టి దీనికి మిగిలిన కులాలవారు అభ్యంతర పెట్టరు. మిగిలిన 5 శాతం ఆర్ధికంగా బలహీనంగా ఉన్న ఇతర అగ్ర కులాలకు ఉంటుంది. ఇలా అన్ని కులాలలోని అర్ధికంగా వెనుకబడిన వారికి న్యాయం జరుగుతుంది కాబట్టి ఏ కులం వారిలోనూ వ్యతిరేక భావనలు రావు.

అత్యధిక జనాభా ఉన్న కాపు కులస్తులలో సామాజిక, ఆర్ధిక వెనుకబాటుతనం ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తున్నది. అందుకే చాలా సంవత్సరాలుగా వారు ఈ రిజర్వేషన్ కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా కాపు కుల సమూహంలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నారు. సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు కుల సమూహానికి ఈ విధంగా అన్యాయం చేయడం మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాదు. 

మీరు ఈ అంశంలో తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మనం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నమ్మిన వారికి న్యాయం చేసినట్లు అవుతుంది. ‘‘ఆలశ్యం అమృతం విషం’’. ఈ వర్గాలకు చెందిన వారు ఇప్పటికే ఏదైనా ఆందోళనాకార్యక్రమానికి ఉపక్రమిస్తుంటే దాన్ని వారు నిలుపుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అత్యంత కీలకమైన ఈ అంశంపై మీరు తక్షణ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

మాస్కులు పంపిణీ చేసిన మణికంఠ ఫౌండేషన్

Satyam NEWS

అదనపు ఎస్పీల బదిలీలు

Bhavani

కిరణ్ మృతిపై విచారణ ప్రారంభించిన గుంటూరు అడిషినల్ ఎస్పీ

Satyam NEWS

Leave a Comment