తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణకే చెందాలనే నినాదంతో కొత్త ప్రత్యామ్నాయం కోసం కృషి చేయాలని హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఓంకార్ భవనంలో ఆదివారం జరిగిన సంపూర్ణ తెలంగాణ సమాలోచన సమావేశం నిర్ణయించింది.
సాయిని నరేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిద్దేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ వనరులు సంపూర్ణంగా తెలంగాణకే ఉపయోగపడాలని డిమాండ్ చేశారు.
కొత్త ప్రత్యామ్నాయ పార్టీ కోసం అంతా కలిసి పనిచేయాలని వక్తలు సూచించారు. సరైన స్పష్టత లేని, ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం లేని పోరాటం, రాజ్యాధికార లక్ష్యం లేని పోరాటం అంతిమంగా పాలకుడికే ఉపయోగపడుతుందని వారన్నారు.
అలా జరగకూడదని కొత్త ప్రయత్నం మొదలు కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
ఈ సమావేశంలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమారస్వామి, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య, వివిధ కులసంఘాల నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు, న్యాయవాదులు, మేధావులు, మహిళలు పాల్గొన్నారు.