శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం టిటిడి ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు దాతల నుండి విశేష ఆదరణ లభిస్తోందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించిన 209 మంది దాతలు సోమవారం శ్రీవారి బ్రేక్ దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం అదనపు ఈవో మాట్లాడుతూ మతమార్పిడులను అరికట్టి హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు మారుమూల ప్రాంతాలలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు(శ్రీవాణి)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 25వ తేదీ నుండి శ్రీవాణి ట్రస్టు కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.3.21 కోట్లు దాతలు విరాళంగా అందించారన్నారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలందించే దాతల కోసం నవంబరు 4న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభించామన్నారు. శుక్రవారం 200 బ్రేక్ దర్శన టికెట్లు, మిగతా రోజుల్లో 500 బ్రేక్ దర్శన టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. డిసెంబరు 31వ తేదీ వరకు ఆన్‌లైన్ కోటాను విడుదల చేశామన్నారు. నవంబరు 4 నుండి ఇప్పటి వరకు 1,961 మంది దాతలు విరాళాలు అందించారని తెలియజేశారు. దేశ, విదేశాల నుండి భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారన్నారు. టికెట్లు పొందిన భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని బ్రేక్ దర్శనానికి వెళ్లవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ట్రస్టుకు విరాళమందించే దాతల కోరిక మేరకు వకుళాదేవి విశ్రాంతి గృహంలో 50 గదులను బస కోసం కేటాయించినట్టు వివరించారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలందించిన వారిలో అమెరికా, జార్జియా, దుబాయి, సింగపూర్ తదితర దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్ నుండి 33 శాతం, తెలంగాణ 22 శాతం, తమిళనాడు 20 శాతం, కర్ణాటక 17 శాతం మంది దాతలు ఉన్నట్టు తెలిపారు. దాతల సహకారంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణం, నిర్వహణ, అర్చక శిక్షణ, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదనపు ఈవో తెలిపారు. అదేవిధంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వసతి గృహాల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆలయాలలో భక్తులకు అవసరమైన తాగునీరు, నీటిని నిల్వ ఉంచేందుకు ట్యాంకులు, రోడ్లు, లైటింగ్, అన్నపస్రాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పురాతన ఆలయాలు, గోపురాల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులకు సహకారం అందిస్తామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
previous post