30.7 C
Hyderabad
April 29, 2024 06: 59 AM
Slider సంపాదకీయం

కాంగ్రెస్ ముక్త భారత్… ఇంత ఈజీగా అయిపోతున్నదే….

#soniagandhi

‘‘కాంగ్రెస్ ముక్త భారత్’’ కాంగ్రెస్ లేని భారత దేశం కావాలి అని నరేంద్ర మోడీ పిలుపునిస్తే ‘‘ఆ… ఇది అయ్యేదా పొయ్యేదా’’ అని చాలా మంది అనుకున్నారు. ఇది సాధ్యం కాదని చాలా మంది భావించారు. అయితే కాంగ్రెస్ ముక్త భారత్ ను మోడీ ఇంత త్వరగా సాధిస్తాడని ఎవరూ ఊహించలేదు.

అధికారంలో ఉన్న పంజాబ్ ను చేజేతులా పోగొట్టుకుని కాంగ్రెస్ పార్టీ తన గోతిలో తానే పడ్డది. పంజాబ్ లో కాంగ్రెస్ ముఠాలను అణచివేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ ఆ రాష్ట్రం నుంచి వైదొలగే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. బిజెపి అంటే ఎంతో కోపంగా ఉన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎంచుకోవాలి.

అయితే అక్కడ అలా జరగలేదు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎంచుకున్నారు తప్ప కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడలేదు. అంటే బిజెపి పై వ్యతిరేకత వచ్చినా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకోవడానికి సన్నద్ధంగా లేదన్నమాట. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కలికానికి కూడా కనిపించడం లేదు. బిజెపి అప్రతిహత విజయాన్ని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. పంజాబ్ ఉత్తర ప్రదేశ్ వదిలేస్తే ఇక చిన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ తన సత్తాను చాటలేకపోతున్నది.

జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం లేక… పార్టీ నిర్మాణం పక్కన పెడితే పార్టీకి నాయకుడే లేక కాంగ్రెస్ పార్టీ కూనారిల్లుతున్నది. గులామ్ నబీ ఆజాద్ లాంటి వారు మానసికంగా మోడీ పంచన చేరారు. ఒక్క గులాం నబీ ఆజాదే కాదు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.

ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేదు. జాతీయ స్థాయిలోనే లేనప్పుడు ఇక రాష్ట్ర స్థాయిలో ఉండే అవకాశమే లేదు. నాయకత్వ లోపం సరిదిద్దు కునే అవకాశమే లేనప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తుంటాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బతికే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేజేతులా చంపుకుంటున్నది. ‘‘దేశ భక్తి’’ విషయంలో కాంగ్రెస్ పార్టీని బిజెపి పూర్తిగా కార్నర్ లోకి నెట్టేసింది.

ముస్లింలకు అనుకూలంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అనే భావన దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అలాగని ముస్లిం పార్టీలు కాంగ్రెస్ తో ఉన్నాయా అంటే అదీ లేదు. ముస్లిం పార్టీలు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎస్.సి ఓట్ బ్యాంక్ ఉండేది. ఆ ఓట్ బ్యాంకు కూడా పూర్తిగా చెదిరిపోయింది. ముస్లింలు, ఎస్ సెలు వివిధ ప్రాంతీయ పార్టీల వైపు చేరిపోయారు.

ఒకటి రెండు ప్రాంతీయ పార్టీలతో తప్ప కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రాతిపదికన స్నేహం కూడా చేయలేకపోతున్నది. అటు ఓటు బ్యాంకు చెదరిపోయి ఇటు కొత్త మిత్రులు రాక, జాతీయ స్థాయిలో నాయకత్వం లేక పోవడంతో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ అడుగంటిపోతున్నది. గతంలో ‘‘లౌకిక వాదం’’ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిజెపిని కార్నర్ చేసేది.

దాన్ని కాల క్రమేణా బిజెపి ‘‘కుహనా లౌకిక వాదం’’ గా మార్చేసింది. విజయం సాధించడం మొదలు పెట్టింది. ఇప్పుడు బిజెపి ‘‘దేశ భక్తి’’ అంశంపై కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నది…. దీనికి కాంగ్రెస్ పార్టీ సరైన జవాబు ఇచ్చే స్థితి లో లేనంత కాలం ఈ దేశంలో బిజెపితో కాంగ్రెస్ పోటీ పడడం దాదాపుగా అసాధ్యమే.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఎమ్మెల్యే రోజాపై పెద్దల రాజకీయ కుట్ర

Satyam NEWS

పర్యాటక రంగ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డిని కలిసిన సత్తిబాబు

Satyam NEWS

శ్రీశైలం లో స్పర్శ దర్శనాల నిలిపివేత

Bhavani

Leave a Comment