కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. విధి నిర్వహణలో ఉండగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. పని ఒత్తిడే మృతికి కారణమని అంటున్నా కూడా మరో ఏడాదిలో పదవి విరమణ చేయాల్సి ఉండగా ఆత్మహత్యకు పాల్పడటం వెనక బలమైన కారణాలు ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే గత మూడు సంవత్సరాలుగా లచ్చాగౌడ్ మాచారెడ్డి మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే విధులకు హాజరైన లచ్చాగౌడ్ మధ్యాహ్నం సమయంలో పోలీస్ స్టేషన్ బ్యారక్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణ చేపట్టారు. న్యూస్ కవరేజీకి వెళ్లిన మీడియాను పోలీసులు లోపలికి అనుమతించలేదు.
మృతుడు లచ్చాగౌడ్ వరంగల్ జిల్లా జనగామ సొంత గ్రామం కాగా మాచారెడ్డి చౌరస్తాలో అద్దెకు ఉంటున్నాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కాలనీలో అందరితో కలివిడిగా ఉండే లచ్చాగౌడ్ మృతి విషయం తెలుసుకున్న కాలని వాసులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఒక్కసారి ఆయన మృతదేహాన్ని చూస్తామని పోలీసులను వేడుకున్నా లోపలికి అనుమతించలేదు.
కుటుంబ సభ్యులతో మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా కాలని వాసులు అడ్డుకున్నారు. వారిని పక్కకు తప్పించి అంబులెన్స్ ను కామారెడ్డి పంపించారు. పని ఒత్తిడే మృతికి కారణమా లేక ఇతరత్రా ఏవైనా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మరో సంవత్సరంలో లచ్చాగౌడ్ పదవి విరమణ ఉండగా పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించగా కుటుంబ సభ్యులు మృతదేహం వెంటనే వచ్చారు. అప్పటికే తన భర్త మరణవార్త విని షాక్ లో ఉన్న లచ్చాగౌడ్ భార్య సుజాత ఆస్పత్రి వద్ద స్పృహతప్పి పడిపోయారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. విధులు ముగించుకున్న లచ్చాగౌడ్ తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీస్టేషన్ కు వచ్చి స్టేషన్ బ్యారక్ లో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.