31.7 C
Hyderabad
May 2, 2024 07: 23 AM
Slider సంపాదకీయం

కరోనా… ఇక ఈ రాజ్యం నీదే ఏలుకో

#Coronavirus New

ప్రయివేటు ఆసుపత్రుల దోపిడిని తట్టుకోలేని ప్రజలు కరోనా మహమ్మారి సమయంలో కూడా సొంత వైద్యం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోయి ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతుంటే అక్కడ మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

ప్రభుత్వ ఆసుప్రతుల్లో కేవలం ప్రాణమే పోతుంది. ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రాణంతో బాటు డబ్బులు కూడా పోతున్నాయి అంటూ ప్రజలు ఏడుస్తున్నా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కరోనా టెస్టింగ్ కు ప్రయివేటు కిట్లు రావడంతో వాటిని కొనుక్కొని తెలిసి తెలియని టెస్టులు చేయించుకుంటున్నారు.

ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్న కరోనా రోగులు

కరోనా పాజిటీవ్ వస్తే ఇంట్లోనే ఉండి గృహవైద్యం చేసుకుంటున్నారు. చిట్కాలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రాణం మీదికి వచ్చిన తర్వాత డాక్టర్ ను సంప్రదిస్తున్నారు. ఈ కారణంగా కరోనా వైరస్ పూర్తిగా విస్తరిస్తున్నది. ప్రభుత్వం కరోనాపై అదుపు కోల్పోయిందనడానికి ఇది నిదర్శనగా ఉంది.

కరోనా వచ్చిన కొత్తలో ఆరోగ్య వ్యవస్థ తో బాటు పోలీసు వ్యవస్థ కూడా విరామం లేకుండా పని చేసింది. కరోనా రోగికి ఎవరి వల్ల సోకింది అనే అంశాన్ని ట్రాకింగ్ తో కనిపెట్టి వారిని కూడా క్వారంటైన్ కు పంపేవారు. ఇప్పుడు అవేవీ ఎక్కడా జరగడం లేదు. జరిగినా నామమాత్రంగా చేస్తున్నారు. అంటే దాదాపుగా ప్రభుత్వం కరోనా కేసుల్ని వదిలేసిందనే చెప్పవచ్చు.

ఎవరి ఖర్మానికి వారిని వదిలేసిన ప్రభుత్వాలు

తెలంగాణ లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ తో బాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది. కరోనాతో సహజీవనం చేయడం అలవాటు చేసుకోండని చెప్పిన పాలకులు దాదాపుగా ప్రజల ఖర్మానికి వదిలేసినట్లుగా కనిపిస్తున్నది. ప్రయివేటు ఆసుపత్రులు కరోనా పేషంట్ వస్తే పండుగ చేసుకుంటున్నాయి.

కనీసంగా 16 లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నాయి. ఇంత బిల్లు కట్టిన తర్వాత కూడా రోగులు చనిపోతుంటే బిల్లు కట్టందే శవాలను కూడా ఇవ్వడం లేదు. కరోనా లాక్ డౌన్ తో ఆకలి చావులు చస్తే ఇప్పుడు ప్రయివేటు ఆసుపత్రులతో అప్పుల పాలై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రయివేటు ఆసుపత్రుల బిల్లు కట్టే పరిస్థితి లేదు

ప్రయివేటు టెస్టింగ్ ల్యాబ్ లను నమ్మే పరిస్థితి లేదు. ప్రయివేటు ఆసుపత్రులకు బిల్లులు చెల్లించే పని లేదు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేదు. కరోనా రోగులు ఎలా బతకాలి? ఈ నేపథ్యంలో సొంత వైద్యం వైపు వెళుతున్న ప్రజలు కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు. ఒక్కో కాలనీలో కనీసం ఐదు నుంచి పది కుటుంబాలు కరోనా వ్యాధితో ఉన్నాయని ఒక అంచనా.

అయినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ కుటుంబాల సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది. అనివార్య పరిస్థితులు కావచ్చు, అవగాహనా లోపం కావచ్చు, మాకేం కాదులే అనే అమాయకపు భరోసా కావచ్చు ప్రజలు మాత్రం కరోనా పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

కరోనా కట్టడి గాలికే

గుంపులు గుంపులుగా తిరుగుతూనే ఉన్నారు. సమూహాలుగా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. మద్యం షాపుల నుంచి మటన్ షాపుల వరకూ ఒకరిపై ఒకరు పడి కొనుగోలు చేస్తున్నారు. ఇక సినిమా హాళ్లు కూడా తెరిచేస్తే కరోనా అనేది లేని ప్రదేశం కనిపించదు.

మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని అదుపు చేయలేక వైరస్ వ్యాప్తికి కారణమైన ప్రభుత్వం ఆ తర్వాత మద్యం దుకాణాలు తెరిచి కరోనాకు గేట్లు ఎత్తింది. ఇప్పుడు ఇక రాత్రి వేళల్లో కూడా లాక్ డౌన్ ఉండదు. సినిమా హాళ్లతో బాటు అన్ని పబ్లిక్ ప్రదేశాలు తెరిచేస్తున్నారు. ఇక ఈ విశాల భారత దేశంలో కరోనా ఆడుకోవడానికి కావాల్సినంత ప్లేగ్రౌండ్ ఉన్నట్లే. కరోనా కబడ్డీ ఆడుకోవచ్చు, క్రికెట్ కూడా ఆడుకోవచ్చు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

నిరంకుశ పాలన తో కొల్లాపూర్ ప్రజలు కష్టాలపాలు….!

Satyam NEWS

హ్యాపీ ఎండింగ్: హైదరాబాద్ చేరుకున్న ఇరాక్ వలస కార్మికులు

Satyam NEWS

ఎనాలసిస్: నీరస పడ్డ దేశానికి మళ్లీ మోడీ టానిక్

Satyam NEWS

Leave a Comment