ప్రైవేటు ఉద్యోగం చేసే వెంకట్‌రెడ్డి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఇబ్బందులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఏం చేయాలి? ఇదే ప్రశ్న వెంకట్ రెడ్డి భార్యతో పంచుకున్నాడు. సమాధానం దొరకలేదు దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇది కథ కాదు. తనువు చాలించిన ఇద్దరి వ్యధ. ఈ సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రంగారెడ్డి జిల్లా మాల్ మండలం దాసన్నపల్లికి చెందిన దెండు వెంకట్‌రెడ్డి(32), నిఖిత(28) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు యశ్వంత్‌రెడి ఉన్నాడు.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నాలుగేళ్లుగా బిఎన్ రెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. సంపాదన లేక ఇద్దరూ విసిగిపోయారు. ఈ క్రమంలోనే సమీపంలోని ఎన్‌జిఓ కాలనీలో నివాసముంటున్న నిఖిత అక్క వరలక్ష్మి ఇంటికి మంగళవారం ఉదయం వెళ్లి కుమారుడిని అక్కడే దించి మళ్లీ వస్తామని చెప్పి ఇంటికి వెళ్లారు.
మధ్యాహ్నం ఇద్దరు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, తమ చావుకు ఎవరు కారణం కాదని, బాబును బాగా చూసుకోవాలని లేఖలో వారు పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆత్మహత్యతో ఒంటరైన రెండేళ్ల కుమారుడిని చూసిన బంధువులు, స్థానికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.