తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నామని సీపీఐ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కార్మికుల ఆత్మహత్యలకు కారణమౌతున్న అధికార టిఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు ఇవ్వలేమని సీపీఐ తెలిపింది. సీపీఐ హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించబోతున్నదని సత్యం న్యూస్ ఉదయమే వెల్లడించిన విషయం తెలిసిందే. హుజూర్ నగర్ లో రేపు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశామని, ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రేపు చర్చిస్తామని వెంకట్ రెడ్డి తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అనే అంశంపై స్పష్టత ఇస్తాం అని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం నుండే ఉందని ఆయన తెలిపారు. హుజూర్ నగర్ లోటిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి ఇబ్బందుల్లో పడ్డామని అందుకోసమే మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
previous post