38.2 C
Hyderabad
April 29, 2024 11: 41 AM
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతి పరిరక్షణ కోసం ‘మహా పాదయాత్ర’

Amaravathi

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో భారీ ఎత్తున రైతులు మ‌హిళ‌లు పాల్గొన్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చెబుతున్నమూడు రాజధానులను వ్య‌తిరేకించారు. రైతులు, మహిళలు చేపట్టిన ఈ యాత్రకు తెదేపా, వాపపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో మహా పాదయాత్ర నిర్వ‌హించారు.

విద్యానగర్ సమీపంలోని శుభం కళ్యాణ మండపం నుంచి గుజ్జనగుండ్ల, హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియం, లక్ష్మిపురం మీదుగా సాగిన పాదయాత్ర లాడ్జ్ సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ముగిసింది. అక్కడ మానవహారంగా ఏర్పడి పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమరావతి ఐకాస నేతలు… ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో ప్రజలకు కనీసం ఇసుక ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా కడతారని ఐకాస నేత గద్దె తిరుపతిరావు ప్రశ్నించారు. కరోనా కారణంగా ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్నామని.. ఇకపై అమరావతి ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోందని హెచ్చ‌రించారు.

అమరావతిలోనే రాజధాని ఉండాల‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రం భరించాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పెద్ద మనిషిగా ఉన్నవెంకయ్యనాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఏపీకి, అమరావతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల ఏడుపు దేశానికి మంచిది కాదని, ఆడవారిని ఏడిపించిన రావణాసురుడు, ధుర్యోదనుడు నాశనమైనట్లు.. వైకాపా సర్కారు పతనం అవుతుందని హెచ్చరించారు.

మార్చాలంటే చర్చించాల్సిందేన‌ని రాజధాని అంశం కేంద్రం పరిధిలోనే ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధాని మార్చాలంటే పార్లమెంటులో చ‌ర్చ తప్పనిసరన్నారు. ఇవాళ గుంటూరులో ఉద్యమించినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయేతర ఐకాస నేత శైలజ అన్నారు.

విజయవాడలోనూ భారీ ర్యాలీ

గుంటూరులో పాదయాత్ర నిర్వహించినట్లుగానే విజయవాడలోనూ భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఐకాస నేతలు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అమరావతికి మద్దతుగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Related posts

జులై 1న ఏవోబీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Satyam NEWS

అన్యాక్రాంతం అవుతున్న ఆలయాల భూములు

Satyam NEWS

అభివృద్ధి అవినీతి గొడవలతో మల్హర్ మండలంలో 144 సెక్షన్

Satyam NEWS

Leave a Comment