నిర్మల్ పట్టణంలోని అస్రా నగర్ కాలనీ శివారులో చిన్నచిన్న పిల్లలు ఆడుకుంటుండగా బండరాళ్లను పేల్చడానికి అమర్చిన డిటోనేటర్ తేలడంతో ఒక బాలుడికి తీవ్ర గాయాలు కాగా మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి, దీంతో తీవ్ర గాయాలపాలైన ఖాలిద్ అనే 11 సంవత్సరాల బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడి భూమిలో ప్లాట్లను చేయడానికి గాను బండరాళ్లను పేల్చివేయడానికి డిటోనేటర్లను అమర్చారు. కొన్ని బండరాళ్లను పేల్చి వేయగా మరికొన్ని బండరాళ్లను పేల్చాల్సి ఉంది. బండరాళ్లను పేల్చడానికి అందులో అమర్చిన డిటోనేటర్ వద్ద పిల్లలు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అదే తేలడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలపాలైన బాలుడి తాత మాట్లాడుతూ స్కూలుకు సెలవు ఉండడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి అటువైపు వెళ్లారని, పిల్లలు ఆడుకుంటుండగా డిటోనేటర్ పేలిందని దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని వెంటనే ఆస్పత్రికి తరలించామని తెలిపాడు.