37.7 C
Hyderabad
May 4, 2024 13: 06 PM
Slider సంపాదకీయం

‘జయంతి’ సాక్షిగా బయటపడ్డ వర్గ విభేదాలు

#jagan

పెయిడ్ సర్వేలతో ప్రజలతో మైండ్ గేమ్ ఆడదామనుకున్న వైసీపీ బండారం బట్టబయలు అయింది. వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అధికార దర్పంతో…. డబ్బుల సాయంతో ఎంతో హడావుడిగా నిర్వహిద్దామనుకున్న కార్యక్రమాలు దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో అట్టర్ ఫ్లాప్ అయినట్లు వైసీపీ పెద్దలకు నివేదికలు అందినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో 25 కు 24 పార్లమెంటు స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని ఇటీవలే ఒక పెయిడ్ సర్వే బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ పెయిడ్ సర్వేను వైసీపీ పెద్దలు విస్తృతంగా వైరల్ చేద్దామని ప్రయత్నాలు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో ఆ పార్టీ నాయకులే హతాశులౌతున్నారు. ఇడుపులపాయల సాక్షిగా వైఎస్సార్ జయంతికి అన్నా చెల్లెలు విడివిడిగా వస్తున్నారని, కుటుంబంలో తీవ్రమైన మనస్పర్థలు ఉన్నాయని వెల్లడి అయిన క్షణం నుంచే పార్టీలో గ్రూపులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ముందుగా వూహించినట్లుగానే వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని మరోసారి ఇడుపుపాయల సాక్షిగా స్పష్టమైంది.

ఎవరికి వారే .. యమునా తీరే… రీతిలో సాగిన ఈ విభేదాలు పార్టీలో కిందివరకూ కనిపించాయి. ఇది పార్టీ పెద్దలు ఊహించలేదు. దాంతో ఒక్క సారిగా ఈ పరిణామానికి వారు విస్తుపోయారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డి, YSR TP అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయనేవి ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి ఇడుపులపాయకు కుటుంబ సభ్యులంతా కాకుండా ఎవరికివారే వెళ్లి నివాళులు అర్పించడం, ప్రత్యేక ప్రార్థనలు చేయడం గమనార్హం.

కాగా ఈ కార్యక్రమానికి షర్మిల వర్సెస్ వైఎస్ జగన్‌గా ఒక్క సీన్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి హాజరవ్వడంతో పాటు జిల్లాలోనే మూడ్రోజుల పాటు వైఎస్ జగన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఎలాంటి అనుమతి లేదని పాసుల  జారీని ప్రజా సంబంధాల శాఖ నిలిపివేసింది. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగే కార్యక్రమాలకు సైతం మీడియాకు అనుమతి లేదని సీఎం జగన్ రెడ్డి కార్యక్రమాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు, లైవ్‌లు తామే అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఈ విషయం  తెలుసుకున్న  షర్మిల మీడియాను రాకుండా ఆంక్షలు విధించడమేంటని అసహనం వ్యక్తం చేసి, తన పర్యటనకు సంబంధించి మీడియా కవరేజికి రావాలంటూ ప్రత్యేకంగా విలేకరులను షర్మిల ఆహ్వానించారు. కడప జిల్లాలో తన పర్యటనే కాదు.. ఇడుపులపాయలో కూడా కవరేజి  రావొచ్చని.. ఎలాంటి ఆంక్షలు లేవని తన వ్యక్తిగత సిబ్బందితో ప్రత్యేకంగా ఫోన్లు చేయించి మరీ మీడియాను షర్మిల ఆహ్వానించడం హాట్ టాపిక్ గా మారింది. ‘అన్న వద్దంటే చెల్లి రమ్మంది’ అనే ఘటన తోనే షర్మిల-జగన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్ కుటుంబంలో  విభేదాలు సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పెరుగుతున్నాయే తప్ప ఫుల్‌స్టాప్ పడట్లేదు.

ఇడుపులపాయలోని తన ఆస్తులను షర్మిల తన కుమార్తె, కుమారుడి పేరిట పంపకాలు చేయగా.. త్వరలోనే హైదరాబాద్‌లోని ఆస్తులను కూడా పంచబోతున్నారని.. అప్పుడే ‘జగన్ వర్సెస్ షర్మిల’ అసలు సినిమా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇది ఇడుపులపాయలో జరిగిన సంఘటన కాగా రాష్ట్రంలోని 70 నియోజకవర్గాలలో వైసీపీలో ఇదే పరిస్థితి నెలకొని ఉందనేది వైసీపీ నేతలకు అందుతున్న సమాచారం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఎంత ఖర్చయినా ఘనంగా నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు బయట పడ్డాయి. అనేక చోట్ల ఎమ్మెల్యే,  వ్యతిరేక వర్గాలుగా విడివిడిగా జయంతిని నిర్వహించాయి. ఎన్నికలు సమీపస్తున్న తరుణంలో వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చ కెక్కడం సీఎం జగన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. టెక్కలిలో  టెక్కలిలో ఎమ్మెల్సీ, జడ్పీటీసీ వేర్వేరుగా వైయస్సార్ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, జడ్పీటీసీ దువ్వాడ వాణి వేర్వేరుగా వైఎస్‌ జయంతిని నిర్వహించారు. గత మూడు నెలలుగా ఒకే ఇంటిలో రెండు గ్రూపులు నడుస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేయడంతోపాటు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కూడా వేర్వేరుగా నిర్వహించడంతో పార్టీ కార్యకర్తల్లోనే ఏమిటీ గ్రూపుల గోల అంటూ గుసగుసలు వినిపించాయి.

టెక్కలిలో ఈ సారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చాన్నాయుడిని ఓడించి వైకాపా జెండా ఎగుర వేయాలని సీఎం జగన్ రెడ్డి ముందస్తు వ్యూహంతో దువ్వాడ శ్రీనివాస్ ను నియోజక వర్గ ఇంచార్జి గా నియమించారు. అచ్చన్న పై పోటీకి దువ్వాడ ను రంగంలో దింపేందుకు ఆయనకు ఎంఎల్ పదవి కూడా కట్టబెట్టారు. అయితే అనూహ్యంగా టెక్కలి ఇంచార్జ్ గా శ్రీనివాస్ సతీమణి వాణిని నియమించడంతో రాజకీయం వేడెక్కింది. అచ్చన్నాయుడిని ఓడించడం మాటెలా వున్న నియోజకవర్గంలో గ్రూపులు వైసీపీ వునికికే ప్రమాదంగా మారాయి. పాతపట్నం నియోజక వర్గంలో వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి జయంతిని నిర్వహించడంతో నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. నియోజకవర్గంలోని మెళియాపుట్టి, ఎల్‌ఎన్‌ పేట, హిరమండలం, పాతపట్నం, కొత్తూరు మండలాల్లో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, తూర్పు కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌లు వేర్వేరుగా వైఎస్‌ఆర్‌ జయంతిని నిర్వహించారు. వీరికి మద్దతుగా ఆయా మండలాల్లోని నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు విడిపోయి కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. హిరమండలంలో ఎంపీపీ తూలుగు మేనక వర్గం కూడా వైఎస్‌ఆర్‌ జయంతిని వేరుగా చేశారు. కొత్తూరు మండలంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైపు ఉన్న బలమైన వైసీపీ క్యాడర్‌ మామిడి శ్రీకాంత్‌ వర్గంతో కలిసి వైఎస్‌ఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

ఇవి ఉదాహరణలు మాత్రమే… ఇలా ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీ రెండుగా చీలిపోయి ఉంది. రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గంలో ఎమ్మెల్యే వర్గం… వ్యతిరేక వర్గాలుగా చీలిపోయి వైయస్అర్ జయంతి నిర్వహించాయి. రాయలసీమ జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పనిచేయడం లేదని  ఆమెను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది.

మద్దికెర మండలం ఎం.అగ్రహారంలో ఎమ్మెల్యే పర్యటనను ఎంపీపీ అనితయాదవ్‌ ఆమె భర్త మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు యాదవ్‌ బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో రెండు వర్గాల వారు వైఎస్సార్‌ జయంతి వేడుకలు వేర్వేరుగా నిర్వహించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో గ్రూపు తగాదాలు ఉన్నట్లు వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఎన్ని మైండ్ గేమ్ లు ఆడినా పరిస్థితి చక్కబడకపోవడం వారిని కలవరపరుస్తున్నది.

Related posts

వ్యభిచార గృహం నడుపుతున్న మహిళాఎస్ఐ తల్లి తమ్ముడు

Satyam NEWS

మళ్లీ క్షిపణి ప్రయోగం: పెట్రేగిపోయిన ఉత్తర కొరియా

Satyam NEWS

కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment