37.2 C
Hyderabad
April 30, 2024 13: 08 PM
Slider విజయనగరం

త్రాగునీటి స‌మ‌స్య‌కు రూ.1.49 కోట్ల‌తో క్రాష్ ప్రోగ్రాం అమ‌లు

#ministerbotsa

వేస‌విని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో త్రాగునీటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు. దీనికోసం 1.49 కోట్ల‌తో ప్ర‌తిపాదించిన క్రాష్ కార్య‌క్ర‌మాన్ని త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని జిల్లాప‌రిష‌త్ స‌మావేశంలో ఆదేశించారు. రాష్ట్ర‌స్థాయిలో నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉన్నందున‌, కొన్ని ర‌కాల పింఛ‌న్ల స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తామ‌ని హామీ ఇచ్చారు.

విజయనగరం జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అధ్య‌క్ష‌త‌న జిల్లా ప‌రిష‌త్ తొలి  స‌ర్వ‌స‌భ్య స‌మావేశం  జెడ్‌పి స‌మావేశ‌మందిరంలో  జ‌రిగింది. ముందుగా ఇటీవ‌ల మృతి చెందిన రాష్ట్ర‌మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అజెండాలోని గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ ప‌థకం, వైఎస్ఆర్ పింఛ‌న్ కానుక‌, జ‌గ‌న‌న్న గృహ‌నిర్మాణం త‌దిత‌ర కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఈ స‌మావేశానికి హాజ‌రై, స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు. ముందుగా జెడ్‌పి ఛైర్మ‌న్ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, అభివృద్దే త‌మ అజెండా అని స్ప‌ష్టం చేశారు. జిల్లాప‌రిష‌త్‌లో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు లేన‌ప్ప‌టికీ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి ఎల్ల‌ప్పుడూ తాము ముందుంటామ‌ని అన్నారు. వేస‌విని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి స‌ర‌ఫ‌రాకు అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని చెప్పారు. దీనిలో భాగంగా క్రాష్ కార్య‌క్ర‌మానికి, తిరిగి చెల్లించే ప‌ద్ద‌తిలో నిధుల‌ను స‌ర్దుబాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

త‌క్ష‌ణ‌మే క్రాష్ ప్రోగ్రామ్ అమ‌లు

వేస‌విలో త్రాగునీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు 1.49కోట్ల‌తో రూపొందించిన క్రాష్ కార్య‌క్ర‌మాన్ని, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానంద‌కుమార్ వివ‌రించారు. ఈ వేస‌వి ప్ర‌ణాళిక‌పైనా, వివిధ మండ‌లాల్లో త్రాగునీటి స‌మ‌స్య‌ల‌పైనా, జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌పైనా సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, చీపురుప‌ల్లి మండ‌లంలోని త్రాగునీటి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించి, కొత్త ట్యాంకును నిర్మించాల‌ని కోరారు. రామ‌తీర్ధ‌సాగ‌ర్‌ను పూర్తి చేసేందుకు కృషి చేయాల‌ని సూచించారు. జెడ్‌పి ఛైర్మ‌న్ మాట్లాడుతూ, చీపురుప‌ల్లిలో త్రాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి 35కోట్ల‌తో ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న పంపించిన‌ట్లు తెలిపారు.

విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, వేస‌విలో ప‌ట్ట‌ణంలో త్రాగు నీటి స‌మ‌స్య రాకుండా, గ‌డిగెడ్డ నుంచి నీటిని విడుద‌ల చేయాల‌ని కోరారు. పార్వ‌తీపురం ఎంఎల్ఏ అల‌జంగి జోగారావు మాట్లాడుతూ, పార్వ‌తీపురం మండ‌లంలోని కొన్ని గిరిజ‌న గ్రామాల‌కు ర‌క్షిత నీటిని అందించాల‌ని కోరారు. శృంగ‌వ‌ర‌పుకోట ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 99 కోట్ల‌తో ప్ర‌తిపాదించిన త్రాగునీటి ప‌థ‌కం ప్ర‌భుత్వం వ‌ద్ద పెండింగ్‌లో ఉంద‌ని చెప్పారు. కొత్త‌వ‌ల‌స మండ‌లానికి త్రాగునీటి స‌ర‌ఫ‌రా కోసం 10కోట్లు మంజూరు చేశార‌ని, మ‌రో 5 కోట్లు అద‌నంగా కేటాయించాల‌ని కోరారు.

నెల్లిమ‌ర్ల ఎంఎల్ఏ బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ, గ‌తంలో మార్చి నుంచే క్రాష్ కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టేవార‌ని, ఈ సారిక కూడా అలాగే చేయాల‌ని చెప్పారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ‌వాణి మాట్లాడుతూ, గ‌రుగుబిల్లి మండ‌ల నీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి, పార్వ‌తీపురం నుంచి నీటిని పంపించే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప‌లువురు జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు త‌మ‌త‌మ మండ‌లాల్లోని స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ, క్రాష్ కార్య‌క్ర‌మాన్ని త‌క్ష‌ణ‌మే ప్రారంభించి, త్రాగునీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూడాల‌ని ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌ను ఆదేశించారు. మున్సిపాల్టీల్లో త్రాగునీటి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు త్వ‌ర‌లో ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌కు సూచించారు.

ఖ‌ర్చు కావాల్సిన క‌న్వ‌ర్జెన్సీ నిధులు 315కోట్లు

 గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కంలో భాగంగా క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగంపై చ‌ర్చ జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 125కోట్లు ఖ‌ర్చు అయ్యాయ‌ని, మార్చి నెలాఖ‌రు నాటికి మ‌రో రూ.315కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంద‌ని డ్వామా పిడి ఉమాప‌ర‌మేశ్వ‌రి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 965 కోట్లు విలువైన 10,896 ప‌నుల‌ను ప్ర‌తిపాదించామ‌ని తెలిపారు. సాఫ్ట్‌వేర్ మార్పిడి కార‌ణంగా త‌లెత్తిన వివిధ సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తోంద‌ని చెప్పారు. ముఖ్యంగా బిల్లుల అప్‌లోడింగ్‌, పెండింగ్ బిల్లులు, సాంకేతిక స‌మ‌స్య‌ల‌పైనే సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. జెడ్‌పి ఛైర్మ‌న్ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, గ‌త ఏడాది ప్ర‌తిపాదించిన ప‌నుల‌ను కూడా ఈ ఏడాది నిర్వ‌హించుకొనేందుకు జిల్లాకు ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా అనుమ‌తి ఇచ్చార‌ని చెప్పారు.

ప్ర‌భుత్వం క‌ల్పించిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని, ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య మాట్లాడుతూ, సిమ్మెంటు స‌మ‌స్య కార‌ణంగా ప‌నులు నిలిచిపోయిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి స్పందిస్తూ, సిమ్మెంటు స‌మ‌స్య రాష్ట్ర‌స్థాయిలో ఉంద‌న్నారు. జిల్లాకు 60వేల మెట్రిక్ ట‌న్నుల సిమ్మెంటు కావాల‌ని ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న పంపించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. సిమ్మెంటు వ‌చ్చేలోగా, గ్రావెల్ రోడ్ల ప‌నుల‌ను మొద‌టు పెట్టాల‌ని సూచించారు.  

ఎంఎల్ఏ క‌డుబండి తోపాటు ప‌లువురు జెడ్‌పిటిసి స‌భ్యులు మాట్లాడుతూ, బిల్లుల అప్‌లోడింగ్లో త‌లెత్తుతున్న స‌మ‌స్య‌లు, పెండింగ్ బిల్లులు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ, సాఫ్ట్‌వేర్ మార్పు కార‌ణంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 14కోట్ల విలువైన బిల్లుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న అప్‌లోడ్ చేయించాల‌ని ఆదేశించారు. కేంద్ర‌ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ప‌నులు జ‌రుగుతాయ‌ని, బిల్లులు కూడా చెల్లించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

పింఛ‌న్ల స‌మ‌స్య ప్ర‌భుత్వం దృష్టికి

సామాజిక పింఛ‌న్ల పంపిణీలో ఈ నెల కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లా రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచింద‌ని డిఆర్‌డిఏ పిడి అశోక్‌కుమార్ తెలిపారు. నెల‌నెలా 3.34ల‌క్ష‌ల పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ప్ర‌తిఏడాది జ‌న‌వ‌రి, జుల్లై నెలల్లో కొత్త పింఛ‌న్లును ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, ద‌ర‌ఖాస్తులు ఎప్పుడైనా పెట్టుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన 8వేల ద‌ర‌ఖాస్తుల్లో, 7013 ద‌ర‌ఖాస్తులను ఆమోదించ‌డం జ‌రిగింద‌ని, వీరికి జులై నుంచి పింఛ‌న్ వ‌స్తుంద‌ని తెలిపారు. సాంకేతిక కార‌ణాల‌తో విద్యుత్ బిల్లులు ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంవ‌ల్ల చాలామందికి పింఛ‌న్లు ఆగిపోయాయ‌ని ప‌లువురు స‌భ్యులు స‌భ దృష్టికి తీసుకువ‌చ్చారు.

వ‌య‌సు ఎక్కువే ఉన్న‌ప్ప‌టికీ, అండ‌ర్ ఏజ్ సాకుతో సుమారు 1700 మందికి పింఛ‌న్లు నిలిపివేశార‌ని, వారికి పున‌రుద్ద‌రించాల‌ని పార్వ‌తీపురం ఎంఎల్ఏ జోగారావు కోరారు. ఎంఎల్‌సి ఇందుకూరి ర‌ఘురాజు మాట్లాడుతూ, ఒక కాలుకి  బోధ‌వ్యాది ఉన్న‌ప్ప‌టికీ, వ్యాధి తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని పించ‌న్ మంజూరు చేయాల‌ని కోరారు. ఒక రేష‌న్ కార్డులో ఇద్ద‌రు అర్హులు ఉన్న‌ప్ప‌టికీ పింఛ‌న్ రావ‌డం లేద‌ని, కుష్టువ్యాధి గ్ర‌స్తుల‌కు పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని, త‌ప్పుడు విద్యుత్ బిల్లుల‌తో పింఛ‌న్లు ఆపేశారని త‌దిత‌ర త‌మ మండ‌లాల్లోని స‌మ‌స్య‌ల‌ను స‌భ్యులు ప్ర‌స్తావించారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, విధాన నిర్ణ‌యాల్లో భాగంగా కొన్ని అంశాల‌పై రాష్ట్ర‌స్థాయిలో నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని, అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఈ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

గృహ‌నిర్మాణ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

జ‌గ‌న‌న్న గృహ‌నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని, ఇందుకు ఎద‌ర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, హౌసింగ్‌పై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్ర‌గ‌తిని, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కూర్మినాయుడు వివ‌రించారు. గ‌రివిడి లేఅవుట్ స‌మ‌స్య‌ను ఆ మండ‌ల జెడ్‌పిటిసి స‌భ్యులు ప్ర‌స్తావించ‌గా, దాని ప‌రిష్కారానికి ఇప్ప‌టికే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని జెడ్‌పి ఛైర్మ‌న్ తెలిపారు.  లేఅవుట్ల‌లో నీరు, విద్యుత్ స‌దుపాయాలు లేవ‌ని, ర‌హ‌దారి సౌక‌ర్యం లేద‌ని ప‌లువురు స‌భ్యులు స‌భ దృష్టికి తెచ్చారు.

గ‌తంలో వివిధ ప్ర‌భుత్వాలు మంజూరు చేసిన ఇళ్ల‌కు బిల్లులు రాలేద‌ని ప‌లువురు స‌భ్యులు ప్ర‌స్తావించారు. ఎస్‌కోట లేఅవుట్‌ను మోడ‌ల్ లేఅవుట్‌గా తీర్చిదిద్దాల‌ని ఎంఎల్‌సి ర‌ఘురాజు కోరారు. మొయిద లేఅవుట్‌కు పూతిక‌పేట మీదుగా ర‌హ‌దారి వేయాల‌ని ఎంఎల్‌సి డాక్ట‌ర్ సురేష్ బాబు విజ్ఞ‌ప్తి చేశారు. సాలురు ప‌ట్ట‌ణానికి చెందిన పేద‌ల‌కు గుమ‌డాం వ‌ద్దే ఇళ్ల‌స్థ‌లాలు కేటాయించాల‌ని ఎంఎల్ఏ పీడిక రాజ‌న్న‌దొర కోరారు.

ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి కాలువ కార‌ణంగా, జ‌గ‌న‌న్న కాల‌నీ ల‌బ్దిదారులు న‌ష్ట‌పోతున్న విష‌యాన్ని కొత్త‌వ‌ల‌స జెడ్‌పిటిసి స‌భ దృష్టికి తెచ్చారు. చివ‌రిగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, అవ‌కాశం ఉంటే సుజ‌ల స్ర‌వంతి కాలువ అలైన్‌మెంట్‌ను మార్చాల‌ని, లేదా ల‌బ్దిదారుల‌కు వేరే చోట స్థ‌లాల‌ను కేటాయించాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న‌న్న గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మానికి మాత్ర‌మే ప్ర‌భుత్వం ఆర్ధిక సాయాన్ని అంద‌జేస్తోంద‌ని, పాత వాటిపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారు. స‌భ్యులు లేవ‌నెత్తిన‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందిస్తాం

సాలూరు ఎంఎల్ఏ రాజ‌న్న‌దొర మాట్లాడుతూ, మెంటా మండ‌లాన్ని అక్క‌డి ప్ర‌జ‌ల కోరిక మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌లిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కోరారు. దీనిపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ, జిల్లాల విభ‌జ‌న‌లో భాగంగా మెంటాడ‌, ఎస్‌.కోట‌, పార్వ‌తీపురం ప్రాంత వాసుల స‌మ‌స్య‌లు, వారి అభిమ‌తాలు త‌న దృష్టికి వ‌చ్చాయ‌ని చెప్పారు. వాటిని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్ల‌డం జ‌రిగింద‌ని, వీలైనంత‌వ‌ర‌కు సానుకూలంగా స్పంద‌న వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం తీసుకొనే ఏ నిర్ణ‌యానికికైనా క‌ట్టుబ‌డి ఉండాల‌ని కోరారు.

ఈ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌తోపాటు, ఎంఎల్‌సిలు పాకల‌పాటి ర‌ఘువ‌ర్మ‌, ఇందుకూరి ర‌ఘురాజు, డాక్ట‌ర్ పి.సురేష్‌బాబు, ఎంఎల్ఏలు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, పీడిక రాజ‌న్న‌దొర‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, దాస‌రి కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ రంగుముద్రి ర‌మాదేవి, శిష్ణ‌క‌ర‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అనూషా ప‌ట్నాయ‌క్‌, డిసిసిబి ఛైర్మ‌న్ వేచ‌ల‌పు చిన‌రామునాయుడు, డిసిఎంఎస్ ఛైర్మ‌న్ అవ‌నాపు భావ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(హౌసింగ్‌) మ‌యూర్ అశోక్‌, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిప్యుటీ సిఇఓ కె.రామ‌చంద్ర‌రావు, వివిధ శాఖ‌ల అధికారులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసి స‌భ్యులు పాల్గొన్నారు.

Related posts

దుబాయ్ లో భారీ వర్షంతో జన జీవితం అతలాకుతలం

Satyam NEWS

కడప జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

Satyam NEWS

బోటు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన జగన్

Satyam NEWS

Leave a Comment