తాగుడుకు బానిస అయిన వారు ఎన్నో ఘోరాలు చేస్తుంటారు. తాజాగా ఒక సుపుత్రుడు కన్నతల్లి గొంతు కోసేశాడు. కన్నతల్లి గొంతు కోసిన ఆ ప్రబుద్ధుడు కాగజ్ నగర్ పట్టణంలోని ఎఫ్ కాలనీకి చెందిన వాడు. వాడిపేరు ప్రశాంత్. తాగుడుకు పూర్తిగా బానిస అయిన ప్రశాంత్ డబ్బుల కోసం రోజూ తల్లితో గొడవపడేవాడట. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కొడుకు తల్లిపై దాడి చేశాడు. తల్లి అరుపులతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అందరూ అక్కడకు చేరి వాడి బారి నుంచి తల్లిని రక్షించారు. అయితే అప్పటికే తల్లి తాడూరి సంధ్యారాణి (45) కత్తి పోట్లకు గురి అయింది. తీవ్రంగా గాయపడిన సంధ్యారాణిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం తో ఆమెను హైదరాబాద్ కు తరలించారు. ఆమె పరిస్థితి క్లిష్టంగానే ఉంది. స్థానికుల సమాచారంతో ఎస్ ఐ గంగన్న సంఘటన జరిగిన స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు ప్రశాంత్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
previous post