విద్య మనిషిని మనిషిగా చేస్తుందని, విద్య పునాది మీదనే ఆశయాల భవనాలను నిర్మించుకోవచ్చునని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, సరస్వతీ సమ్మాన్ గ్రహీత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అన్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పరిశోధనా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో విద్య నా అనుభవాలు సదస్సు బుధవారంనాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వడ్డేపల్లి తన సాహిత్య ప్రస్థానాన్ని, లలిత గీతాలు రచించిన విధానాన్ని, సినిమా పాటల రచనను సోదాహరణంగా వివరించారు.
పరిశోధనలు ఎప్పుడూ ‘‘ఉపరి’’శోధనలు కాకూడదన్నారు. తెలుగు సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి తెలుగును జీవికగా మార్చుకోవాలన్నారు. తన నాలుగున్నర దశాబ్దాల అనుభవాలను వడ్డేపల్లి సభ ముందుంచారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సదస్సు డైరెక్టర్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీ డాక్టర్ పి కనకయ్య మాట్లాడుతూ యువతరానికి ఈ విద్యా సదస్సు మంచి స్ఫూర్తిని నింపిందని, తమ సుదీర్ఘ విద్యానుభవాలను అందరికి పంచిన డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ఆదర్శనీయుడని అన్నారు.
తెలుగు సాహిత్యం జీవితానికి అన్వయం చేసుకుని మున్ముందుకు సాగమన్న డాక్టర్ కాసర్ల నరేశ్ రావులకు ప్రత్యేక ధన్యావాదాలు అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో ఆంగ్ల విభాగపు అధ్యక్షలు డాక్టర్ కె వి రమణాచారి, హిందీ విభాగపు అధ్యక్షలు డాక్టర్ మహ్మద్ జమీన్ అహ్మద్, రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, పరిశోధక విద్యార్ధులు, సాహిత్య విద్యార్ధులు హర్ష, అమూల్య, మాధుర్య, మంజుల, మహేందర్ రెడ్డి, విష్ణు, నవీన్, రమేష్, అనీల్, కేదార్ నాథ్, గైని రవి తదితరులు పాల్గొన్నారు.