ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించాల్సిన అవసరం ఆధునిక సమాజంలో ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మనబడి నాడు-నేడు కార్యక్రమం విజయవంతమైందన్నారు. భవిష్యత్తులో ఆంగ్ల విద్య వల్ల ప్రపంచ స్థాయిలో పోటీ పడే అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ కుమార్తె అయిన ఒక విద్యార్థిని ముఖ్యమంత్రి వద్దకు వచ్చి మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ విద్యనభ్యసిస్తున్న తమకు ఆంగ్ల బోధన దూరమైందన్న విషయం బాలిక గుర్తుచేసి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోవడం వల్ల విద్యావ్యవస్థలో పేద విద్యార్థులు పడుతున్న సమస్యను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించిందన్నారు.
2006-08 సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంగ్ల విద్యకు రాష్ట్రంలో బీజం వేశారని మంత్రి గుర్తుచేశారు. దానిని అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పేదరికం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కొన్ని ఉన్నతవర్గాల పేదలకు తమ తమ పిల్లలకు ఆంగ్ల విద్యను అందించేందుకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థులు అభివృద్ధి చెందడానికి ఆంగ్ల మాధ్యమం బోధన తప్పనిసరి అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న సంచలన నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను మార్పు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 1,85,000 ఉపాధ్యాయులకు గాను 68వేల మంది ఉపాధ్యాయులకు జనవరి నుంచి 5 నెలల పాటు ఆంగ్ల మాధ్యమంలో తర్ఫీదునిస్తామన్నారు. అందుకగనుణంగా శిక్షణా కేంద్రాలను (ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయ విద్యను అభ్యసించే నాటి నుండే డైట్ కాలేజీల్లో ఆంగ్ల భాషను ఛాత్రోపాధ్యాయులకు నేర్పిస్తామన్నారు. తద్వారా భవిష్యత్ లో ఉపాధ్యాయ వృత్తిలో ఎంపిక అవ్వడం ద్వారా బోధన సులవవుతుందన్నారు. ఇప్పటికే ఇప్లూ తరహా లాంటి సంస్థలతో ఒప్పందం(ఎంవోయూ) చేసుకున్నామన్నారు. పేద విద్యార్థులు ఆంగ్లం అభ్యసిస్తే తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావించిన ప్రతిపక్షం గోబెల్స్ ప్రచారానికి తెరతీసిందన్నారు.