26.7 C
Hyderabad
May 3, 2024 07: 51 AM
Slider ప్రత్యేకం

ఉపాధ్యాయ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా

#education

ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీలో తొలిసారిగా ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటా అమలు కానుంది. పాఠశాల విద్యాశాఖలో మొత్తం 13,086 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా వాటిలో 10 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులున్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దరఖాస్తులను విద్యాశాఖ స్వీకరిస్తోంది. ఆ పరీక్ష జూన్‌ 12న జరగనుంది. ఆ ఫలితాలు వెల్లడైన తర్వాత ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు- టీఆర్‌టీ) నిర్వహిస్తారు. అందులో రిజర్వేషన్‌ పరిధిలోకి రాని ఓసీలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం పోస్టులను కేటాయిస్తారు.

అన్ని ప్రభుత్వ కొలువులు, ఉన్నత విద్య సీట్ల భర్తీలో ఈ కోటా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 24వ తేదీన జీవో 244 జారీ చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారు ఈ రిజర్వేషన్‌ పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంది. ఇందులో అన్ని వర్గాలవారూ వస్తారు. ఈడబ్ల్యూఎస్‌ (10 శాతం) కోటాలో మాత్రం ఓసీ పురుషులతోపాటు మహిళలు వస్తారు. అంటే మహిళలకు మరిన్ని పోస్టులు దక్కే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలులో ఉన్నత విద్య సీట్ల భర్తీకి, ఉద్యోగాల నియామకానికి తేడా ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఉదాహరణకు ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో 100 సీట్లు ఉంటే మరో 10 సీట్లు సూపర్‌ న్యూమరరీ కింద పెంచుతారు. ఉద్యోగాల నియామకాల్లో ఖాళీల సంఖ్య పెంచరని, 50 శాతం కోటాలోనే రిజర్వేషన్‌ అమలవుతుందని భావిస్తున్న విద్యాశాఖ వర్గాలు, దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నాయి. ఉపాధ్యాయ నియామకాలు జిల్లాస్థాయివి అయినందున జిల్లాల వారీగానే 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తారు. అందులోనూ ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ వారీగా రిజర్వేషన్‌ ఉంటుందని చెబుతున్నారు.

Related posts

మానవత్వం చాటిన జనచైతన్య ట్రస్ట్

Bhavani

గొర్రెతోక బెత్తెడులా సమగ్ర శిక్ష టీచర్ల జీతాలు

Satyam NEWS

జై తెలంగాణ:తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి

Satyam NEWS

Leave a Comment