ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు మిచౌంగ్ తుఫాను ముంచుకు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సహాయ చర్యలను విస్తృతం చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తుఫాను కారణంగా కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి డిమాండ్ చేశారు.
ఒకవైపు కరువు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కనీస బాధ్యత లేకుండా రైతులను నిలువునా ముంచింది. ఇప్పుడు తుఫాను విషయంలో ప్రభుత్వం తగు రీతిలో స్పందించకపోతే రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ధాన్యం కొనుగోలులో తేమ శాతం విషయంలో, రైసుమిల్లర్లు సేకరణ,నిల్వ విషయంలో ఆంక్షలు తొలగించాలని బిజెపి కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది. తుపాను తరుముకొస్తున్న వేళ పంట కోసిన వెంటనే కొనుగోలు చేసేందుకు రైతు భరోసా అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంతో రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ల ద్వారా కోతలు ముమ్మరం చేసినప్పటికీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయాలి. పొలాల్లో రోడ్లపై ఆర బెట్టిన ధాన్యాన్ని కాటా వేసేందుకు అధికారులు ముందుకు వచ్చి తేమ శాతం విషయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా తక్షణమే మిల్లులకు చేర్చాలి. రైతు భరోసా కేంద్రాల్లో సంచుల కొరత తీవ్రంగా ఉంది, దానికి వెంటనే పరిష్కరించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ప్రతీ జిల్లా పరిధిలోని మార్కెట్ యార్డులను , రైతుభరోసా కేంద్రలతో అనుసంధానం చేసి నిల్వ సదుపాయాలను R.D.O స్ధాయి అధికారి నిరంతరం పర్యవేక్షణ చేయాలి.
ధాన్యం తరలింపు కోసం లారీలను, మిల్లర్లును రైతు భరోసా కేంద్రాలను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రైతు భరోసా కేంద్రం అధికారులు గానీ ప్రభుత్వం గానీ స్పందించి తక్షణం చేతికొచ్చిన వరి పంటను త్వరితగతిన కొనుగోలు చేయకుంటే బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు.