కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా విజృంభణ తర్వాత చాలా దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019తో పోలిస్తే 2020లో 31 మిలియన్ల మంది కొత్తగా కటిక పేదరికంలోకి వెళ్లారని గోల్‌కీపర్స్ వార్షిక నివేదిక వెల్లడించింది. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కి చెందిన బిల్ ఫేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఈ నివేదికను రూపొందించారు.
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని నివేదిక తెలిపింది. అధునాతన ఆర్థిక వ్యవస్థల్లో 90 శాతం వరకు వచ్చే ఏడాది నాటికి తలసరి ఆదాయ స్థాయిలను తిరిగి పొందుతాయని పేర్కొంది. తక్కువ, మధ్యస్థ ఆదాయాలు గల ఆర్థిక వ్యవస్థలలో మూడింట ఒక వంతు మాత్రమే తిరిగి తలసరి ఆదాయ స్థాయిలను చేరుకోగలవని నివేదిక అంచనావేసింది.
ఆరోగ్యం, ఆకలి, వాతావరణ మార్పు వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని నివేదిక పేర్కొంది. కరోనాతో మహిళలు ఎక్కువగా ఆర్థికంగా కుదేలయ్యారనే అంశాన్ని వెల్లడించింది. అధిక, తక్కువ ఆదాయ దేశాలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆర్థికంగా దెబ్బతిన్నారని నివేదిక తెలిపింది.
సంపన్న దేశాలు, కమ్యూనిటీలు కోవిడ్-19 ను పేదవారి రోగంగా పరిగణించే ప్రమాదం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందితేనే.. కరోనాని అధిగమించొచ్చని పేర్కొంది. టీకాలు, ఔషధాలను అభివృద్ధి చేసే విషయంలో పేద దేశాల పరిశోధకులు, తయారీదారులకు అండగా ఉండాలని.. అందుకు స్థానిక భాగస్వాములు పెట్టుబడి పెట్టాలని నివేదిక కోరింది.