సజావుగా సాగాల్సిన పరిపాలనలో స్వతంత్రించి జీవోలు విడుదల చేస్తూ కల్లోలం సృష్టిస్తున్న సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పై ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాల ప్రకారం జీవోలు విడుదల కావడం లేదని ఆరోపిస్తూ ఏ శాఖ కార్యదర్శి ఆ శాఖ కు చెందిన జీవోలు విడుదల చేసుకోవచ్చునంటూ బిజినెస్ రూల్సుకు వ్యతిరేకంగా 128 జీవో ఇచ్చిన ప్రవీణ్ ప్రకాశ్ ఆ తర్వాత మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ముఖ్యమంత్రి పేరు చెప్పి సీనియర్లకు కూడా ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేస్తున్నారని కొందరు ఐఏఎస్ అధికారులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాశ్ జారీ చేసిన మరో ఉత్తర్వు కూడా పెను వివాదానికి దారితీసింది. సచివాలయం లో ముఖ్య కార్యదర్సులు, కార్యదర్సులు తరువాత మధ్య స్థాయి అధికారులు కీలక భూమిక పోషిస్తారు. వీరి ద్వారానే ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు అన్నీ కింది స్థాయిలో అమలు జరుగుతాయి. మధ్య స్థాయి అధికారులులో అదనపు, సంయుక్త, ఉపకార్యదర్శులు ఉంటారు.
వీరి బదిలీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో జరుగుతాయి. వీరు ఏ శాఖలో పనిచేస్తారో సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి వీరికి బాధ్యతలు కేటాయిస్తారు. అయితే ఇటీవల ప్రవీణ్ ప్రకాశ్ జారీ చేసిన ఉత్తర్వులో మధ్య స్థాయి అధికారుల బాధ్యతలు కూడా ఆయనే నిర్ణయించారు. సచివాలయం లోని చాలా శాఖలలో మధ్య స్థాయి అధికారులకు వారు చూసే ఉప శాఖలను మారుస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఆదేశాల పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయితే ఈ ఉత్తర్వులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పగా మరికొందరు కూడా ఇదే విధంగా తమ వద్ద పని చేసే మధ్య స్థాయి అధికారులతో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రవీణ్ ప్రకాశ్ 1994వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఎక్కడ పనిచేసినా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ప్రవీణ్ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుందని ఉత్తరప్రదేశ్ కు చెంది ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి ఆయన సమక్షంలోనే వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఈయన కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావటం ఇక్కడ గమనార్హం.
ఈయన విశాఖ జిల్లా కలెక్టర్ గా పనిచేసే సమయంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. విశాఖ కలెక్టర్ గా ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ మరణంతో జరిగిన ఉప ఎన్నిక ఎన్నడూ లేనంత వివాదాన్ని మూటగట్టుకున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఈయన వ్యవహార శైలి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తో పాటు విశాఖ ఒకటవ నియోజకవర్గం ఉపఎన్నికను ఎన్నికలు జరిగిన రోజునే రద్దు చేసింది. దీనితో పాటు తక్షణం జిల్లా కలెక్టర్ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దేశ చరిత్రలో ఎన్నిక పూర్తి అయిన తరువాత ఎన్నికను రద్దు చేయటం అరుదని ఎన్నికల సంఘం అధికారులే అప్పట్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కు చెందిన సీనియర్ అధికారి తో ఫోన్లో దురుసుగా మాట్లాడారని అప్పట్లో ఈయన పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం జిల్లా కలక్టరు పదవి నుంచి బదలీ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్ గా నియమించినా ఎక్కడా రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేయకపోవటం విశేషం.
ఢిల్లీ లో రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ఈయనను ఇటీవల ముఖ్య మంత్రి కార్యదర్శి గా నియమించి సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి గా అదనపు బాధ్యత అప్పచెప్పారు. ఈ పదవిలో ఉంటూ జారీ చేసిన పలు ఉత్తర్వులు చాలా వివాదాలు నెలకొనే విధంగా ఉన్నాయి.