ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కార్మికులు సమ్మె విరమించాలని తాము ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సమస్యను తేల్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో శుక్రవారం కోర్టుకు రావాలని ఆర్థికశాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికుల డిమాండ్లలో కనీసం నాలుగు డిమాండ్లు పరిష్కరించి, రూ.47 కోట్లు ఇస్తారా? లేదా? అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రూ.47 కోట్లు వెంటనే ఇవ్వలేమని, గడువు ఇస్తే ప్రయత్నిస్తామన్న ఏజీ చెప్పారు. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించడంపై న్యాయస్థానం స్పందించింది. కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు వాస్తవాలను మరుగునపెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.