భార్యతో గొడవ పడిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బోయపాలెంలో నివాసం ఉంటున్న శేఖర్ బేల్దారి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. శేఖర్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నాయుడు పల్లి గ్రామానికి చెందిన వాడు కాగా, కడప జిల్లా బద్వేలు మండలం కొంగలవీడు గ్రామానికి చెందిన కుమారి తో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
వివాహం జరిగిన రెండు సంవత్సరాలకు ఒక కుమారుడు జన్మించాడు. గత కొంత కాలంగా శేఖర్ తాగివచ్చి ఇంట్లో గొడవపడేవాడని ,ఇదే విషయమై భార్య కుమారి భర్తతో వాదించేదని తెలిసింది. నిన్న కూడా కూలి పని చేసుకుని తాగి ఇంటికి వచ్చిన భర్తతో కుమారి వాదించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఇంట్లోకి వెళ్లిన శేఖర్ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినా అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్ తెలిపారు. దీనిపై పోలీసులు బంధువుల నుండి వివరాలు సేకరించి మృతికి గల కారణాలు తెలుసుకొని విచారిస్తున్నారు.