38.2 C
Hyderabad
April 29, 2024 13: 44 PM
Slider ప్రత్యేకం

ఫేక్ ప్రాపగాండ చేసే ఏ ఒక్కడినీ వదిలిపెట్టను

#TDP

తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా నలభై ఏళ్లుగా సాగుతున్న నిరాధార ఆరోపణలు, అసత్యాల దాడులకి చెక్ పెడతానన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేసిన లోకేష్, శుక్రవారం వాంగ్మూలం నమోదుకి హాజరయ్యారు.

అనంతరం మంగళగిరి టిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో నా చదువు, ఫీజులపై అడ్డగోలు ఆరోపణలు చేశారు. కాలేజీ ఫీజు చెల్లించిన మా బ్యాంకు ఖాతాల వివరాలు, రశీదులు ఆధారాలతో సహా నిరూపించాం. అంతటితో ఆగని కాంగ్రెస్ నేతలు నా వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు గుప్పించారు. నాకు రెండో పెళ్లి అయ్యిందని, ఇంకో అబ్బాయి ఉన్నాడని..దారుణమైన ఫేక్ ప్రాపగాండ చేశారు.

ఇదంతా నేను ప్రత్యక్ష రాజకీయాలకి రాకుండా ముందే మొదలు పెట్టారు. నాడు కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ ఫేక్ ప్రాపగాండని, ఆ తరువాత వైకాపా అందిపుచ్చుకుంది. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నుంచీ వైకాపా నన్ను బాడీ షేమింగ్ చేస్తూ, లేని ఫోటోలు మార్ఫింగ్ చేశారు. నా విద్యాభ్యాసమంతా ఇంగ్లీషు మీడియంలో సాగడంతో తెలుగు మాట్లాడేటప్పుడు అటు ఇటు ఒక పదం అనడం వల్ల వాటినే భారీ ఎత్తున ట్రోలింగ్ చేశారు, దారుణమైన భాషతో నన్ను అవమానించారు.

టిడిపి సర్కారు అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్, అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్, ఐటీ కంపెనీలకి ఇచ్చిన ఇన్సెంటివ్ కుంభకోణం పేరుతో వైకాపా ఆరోపణలు చేసింది. టిడిపి పాలనలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకం వేసి 6 పైసల అవినీతిని కూడా నిరూపించలేని వైకాపా ఇప్పుడు మరో మార్గంలో ఆరోపణలు ఆరంభించింది. టిడిపి ఓటమి తరువాత కూడా నేనే లక్ష్యంగా వైకాపా చేయని దుష్ప్రచారం లేదు.

ఫోటోలు మార్ఫింగ్, స్పీచ్ ఎడిటింగ్, వీడియోలు ట్యాంపరింగ్ చేస్తున్నారు..జగన్ దళితులకి ఏంపీకారని నేను ప్రశ్నిస్తే..దళితులు ఏం పీకుతున్నారని వీడియో మార్ఫింగ్ చేయడం వైకాపా విషప్రచారానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. వైకాపా కోసం పేటీఎం బ్యాచులు చేస్తున్న ఈ ఫేక్ ప్రాపగాండకి చెక్ పెట్టాలనే నిర్ణయించుకున్నానని చెప్పారు. వైకాపా నేతల తప్పుడు ప్రచారంపై క్రిమినల్, సివిల్ పరువునష్టం కేసులు వేస్తున్నానన్నారు.

విశాఖ ఎయిర్ పోర్టులో 25 లక్షలు చిరుతిండ్లు నేను భోంచేశానని సాక్షి, డెక్కన్ క్రానికల్, వీక్ పత్రికలలో వేయించారు. దీనిపై నోటీసులు పంపితే వీక్ పత్రిక క్షమాపణలు చెప్పగా సాక్షి, డెక్కన్ క్రానికల్ స్పందించలేదన్నారు. సాక్షిపై 75 కోట్లు, డెక్కన్ క్రానికల్ పై 25 కోట్లు పరువునష్టం దాఖలు చేశానన్నారు.

వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యక్తిగతంగా నా తండ్రి, తల్లి, భార్య బ్రాహ్మిణి దూషించడంతోపాటు నీతి నిజాయితీగా వ్యాపారాన్ని నడుపుతుంటే సారా వ్యాపారం చేస్తున్నారని..మా అమ్మ, బ్రాహ్మిణి తాగుతారని చెప్పలేని భాషలో ఆరోపించారు. ఆమెకి నోటీసులు పంపితే తీసుకోకపోవడంతో 50 కోట్లకి క్రిమినల్ డిఫర్మేషన్ కేసు దాఖలు చేశానన్నారు.

మా పిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి చావుకి నేనే కారణం అని వైకాపా నేత గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనేక ఆరోపణలు చేశాడు. నాకు అక్కాచెల్లెళ్లు లేరు, నా పిన్నమ్మ కూతుర్లే నా చెల్లెళ్లు.. వారి పెళ్లిళ్లు నా తల్లి ఒక బాధ్యతగా చేసింది. మా పిన్నమ్మపై ఆస్తి కోసం దాడి చేశానని, సోషల్మీడియాలో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పోస్టులు పెట్టాడు.

తప్పుడు సర్వే నంబర్లతో తప్పుడు పోస్టులు నాపై పెట్టిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి నోటీసులు పంపితే..పిరికి సన్నాసి అవి తీసుకోలేదు. అందుకే 50 కోట్ల పరిహారానికి పరువునష్టం కేసు వేశాను. 1982 నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు, నేను, నా కుటుంబంపైనా పథకం చేస్తున్న ఈ విషప్రచారానికి చెక్ పెట్టాలని ..సివిల్, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తున్నానని వివరించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసేవారిని ప్రచురించేవారిని, ప్రసారం చేసే ఏ ఒక్క వైకాపా వాడిని, మీడియాని వదిలిపెట్టను అని హెచ్చరించారు.

నేను ఏ నాడూ ఒక్క తప్పు చేయలేదు. జగన్ తన తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లు దోచుకున్నాడు. అందుకే ఆయన ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. జగన్ పై మేము చేసిన ఆరోపణలని సీబీఐ నిర్ధారించింది..మాపై వైకాపా చేసిన ఆరోపణలలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు.

నా భార్యని, నా తల్లిని, నా కొడుకుని అవమానించారు వైకాపా పేటీఎం బ్యాచ్. సొంత బాబాయ్ ని చంపేసి నారాసుర రక్తచరిత్ర అని సాక్షిలో వేశారు. ఈ హత్యకేసులో సీబీఐ జగన్ రెడ్డి తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఏ8గా పేర్కొంటూ, చార్జిషీట్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా తేలాల్సి ఉందని పేర్కొనడం వైకాపా విషప్రచారాన్ని మరోసారి బయటపెట్టింది.

పది ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా..ఆధారాలు లేకుండా ఏ ఒక్కరిపైనా ఒక్క ఆరోపణ చేయలేదు. నేను యువగళం పాదయాత్రలో ఏ వైకాపా ఎమ్మెల్యే ఎంత అవినీతి చేశాడో ఆధారాలతో సహా బయటపెట్టాను. నేను నిరాధార ఆరోపణలు చేయను. దమ్ముంటే నేను బయటపెట్టిన అవినీతిపై స్పందించాలి. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కోడికత్తి, బాబాయ్ హత్య డ్రామాలాంటివే జగన్ రెడ్డి మళ్లీ మొదలుపెట్టవచ్చు. రౌడీల చుట్టూ రౌడీలుంటారు..జగన్ ఓ 420 ఆయన చుట్టూ ఉన్నవాళ్లు 420లే. రెండు ప్రభుత్వ పదవుల్లో ఉండి, తప్పుచేసి నోటీసులు పంపితే తీసుకోలేదంటే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఎంత తప్పుడు మనిషో అర్థం అవుతోందన్నారు.

ఊరికే ఆరోపణలు చేసి పారిపోతామంటే, ఊరుకోను..ఆధారాలుంటే రాయండి, మాట్లాడండి..అసత్యాలు ప్రచారం చేస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. ఏ మీడియాని వదలను. సీఐడీ సీఎం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ గా మారిపోయింది. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానానికి దాదాపు రూ.2కోట్ల విరాళం ఇచ్చాం.

అలాంటిది మాపై పింక్ డైమండ్ దొంగతనం ఆరోపణలు చేసి పారిపోయారు. నాపై చేసే ఆరోపణలకు ఎన్నోసార్లు నేను సవాల్ విసిరినా, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప నిరూపించారా ? అని లోకేష్ సవాల్ విసిరారు.

Related posts

సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

Satyam NEWS

గంగుల ఇంటిపై ఐ‌టి, ఈడీ సోదాలు

Murali Krishna

బైంసా అల్లర్ల పై పార్లమెంటులో గళం విప్పిన ఎంపీ సోయం

Satyam NEWS

Leave a Comment