కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండులో గల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం చేతులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇందిరాగాంధీ చేతులు పూర్తిగా తీసివేసి కాళ్ళ వద్ద పెట్టారు. అంతే కాకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహాన్ని పరిశీలించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పట్టణ సిఐకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం అమానుషమన్నారు. గతంలో విగ్రహం మీద దాడి జరిగినపుడు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తామన్నారని, ఇప్పటికి స్పందన లేదని తెలిపారు.
పార్టీ కార్యాలయ అద్దాలు కూడా ధ్వంసం చేశారని, ఇందిరాగాంధీ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తి, నేటి ఘటనకు కారణమైన వ్యక్తి ఒక్కరేనా పోలీసులు విచారణ చేపట్టాలని అన్నారు. విగ్రహం ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తిని అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు