టిటిడి లో ధర్మారెడ్డి తొందరపాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని, హిందువులలో అభద్రతా భావం ఏర్పడుతోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న రెండు పెద్ద లడ్డూలు, రెండు వడ, ఐదు చిన్న లడ్డూలను ఇవ్వడం నిలిపివేయాలని ధర్మారెడ్డి నిర్ణయించడం అన్యాయమని ఆయన అన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూ. అందులోనూ కళ్యాణం లడ్డు కి ప్రత్యేకత ఉంది. శ్రీవారి కల్యాణోత్సవం సేవలో పాల్గొన్న ప్రతి జంటకు చిన్నపాటి వస్త్రం,జాకెట్టు తో పాటు కళ్యాణం లడ్డు వడలు ఇవ్వడం అనాదిగా తిరుమల ఆలయంలో వస్తున్న సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయానికి ధర్మారెడ్డి మంగళం పాడటం అనాలోచిత నిర్ణయమని ఆయన విమర్శించారు.
ధర్మారెడ్డి మూడవ సారి తిరుమలకు వచ్చిన నాటి నుంచి ధార్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. వడ్డించే వాడు మనవాడు అయితే ఏ బంతిలో అయినా కూర్చోవచ్చు అన్న చందంగా తిరుమల జే ఈ ఓ గా (ఐఏఎస్ కాదు కాబట్టి) ధర్మారెడ్డి కి అర్హత లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ గా ఉత్తర్వులు ఇచ్చారని ఆయన అన్నారు.
నెల తిరగక ముందే తిరిగి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడం టీటీడీ చరిత్రలో మొదటిసారి అని ఆయన అన్నారు. అది కూడా చాలదన్నట్లు ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా మరో పదవిని కట్టబెట్టారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ప్రచారం పేరుతో కోట్లాది రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు చేస్తూ తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఇచ్చే సబ్సిడీ లడ్డుని తొలగించడం, ఇప్పుడు ఏకంగా కల్యాణోత్సవంలో ఇచ్చే ఉచిత పెద్ద లడ్డు, వడ లను అదనపు ధర చెల్లిస్తే ఇస్తాం అని చెప్పడం దుర్మార్గమని ఆయన అన్నారు. శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో ఒక్క టికెట్ 10 వేల రూపాయలకు అమ్ముతున్నారు ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మే నెల నుంచి కొత్త విధానం అమలు చేస్తామని అనధికారికంగా ధర్మారెడ్డి చెబుతున్నా ఈ ఏకపక్ష నిర్ణయాలపై ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు ఉత్సవ విగ్రహాలలా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ధర్మారెడ్డి తీరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.