ఆకుపచ్చని వన్నెల వసంతం
ఆత్మీయంగా అనేదొకటే
తనలాగే ఆశలు చిగురింప
జేసుకోమని
మండే ఎండల గ్రీష్మం
గురువై బోధించేదొకటే
అగ్నిపుష్పంలా తేజరిల్లమని
కురిసే వర్షం పుడమికి అభిషేకం చేస్తూ
అందించే ఉపదేశమొకటే
ప్రాణికోటిపై కరుణ చూపమని
చల్లని వెన్నెలల శరదృతువు
చనువుగ మనకు చెప్పేదొకటే
మనసును వెన్నెల చేసుకోమని
వణికించే చల్లగాలుల హేమంతం
హెచ్చరిస్తూ పలికేదొకటే
బద్ధకం వీడి, లక్ష్య సాధన చేయమని
ఆకులు రాల్చే శిశిరం
పదేపదే అంటుంది
అన్నీ కోల్పోయినా ధైర్యం కోల్పోవద్దని..
రేపటి పై ఆశ వీడవద్దని
నేర్చుకునే నేర్పుండాలే కానీ
ఋతువులు ఇచ్చేసందేశాలెన్నో
ప్రకృతి ఓ గొప్ప పాఠశాల!
జె. శ్యామల
5 comments
Kavitha bagundi madam??
Thank you
ఋతువులు మీద వ్రాసిన గేయం చాలా బాగుంది
మంచి సందేశం కూడా ఉంది
రచయిత్రి గారికి అభినందనలు
మీ స్పందనకు ధన్యవాదాలు
కవిత బాగుంది మేడం