28.7 C
Hyderabad
April 26, 2024 08: 42 AM
Slider అనంతపురం

జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు

#press freedom

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కులకు విఘాతమని, ఇలాంటి చర్యలు భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.

ఇటీవల జర్నలిస్టులపై జరిగిన దాడులను, సీఐడీ పెట్టిన కేసులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు సోమవారం నగరంలోని సంగమేశ్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జర్నలిస్టులపై దాడి చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని,

జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జర్నలిస్టులకు వృత్తి గతమైన భద్రత చర్యలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్ అని నినాదాలు చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్ అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు సంఘీభావంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ జర్నలిస్టులపై రాజకీయ నాయకుల అనుచరులు దాడి చేయడం ఏమైనా చర్య అని, దీన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైదరాబాద్ కు వెళ్ళిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వార్తను కవర్ చేయడానికి వెళ్ళిన విలేకర్లపై ఆయన అనుచరులు దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు.

అంతేకాకుండా వివేకా హత్యకేసుపై కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్, కడప ప్రాంతాల్లో న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన విలేకర్లను బెదిరించడం, వారిపై దౌర్జన్యానికి దిగడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులకు దిగడంతో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. పత్రికా రంగానికి భావ ప్రకటనా స్వేచ్ఛ లేనిపక్షంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కును

కాలరాచినట్లేనని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రశ్నించే గొంతుక లేకపోతే ప్రజా స్వామ్యానికి మనుగడ ఉండదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలుపుతున్న పత్రికా రంగాన్ని, విలేకర్లను అణచివేసే ధోరణిలో అధికార పార్టీ నేతలు తమ అనుచర గణాన్ని రెచ్చగొడుతున్నారని ఏకరువు పెట్టారు. ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాలను ఎండగట్టేందుకు ప్రజా సంక్షేమవాదులు గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు.

విలేకర్లపై దాడికి పాల్పడిన ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని, విజయనగరంలో జర్నలిస్టులపై సిఐడి పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడం లేదని ప్రశించే వారిని అణచివేస్తూ కుట్ర కేసులు పెడుతున్నారన్నారు.

అంతేకాకుండా పక్షపాత వైఖరిని అవలంబిస్తూ దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి వికృత చర్యలు మానుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు ఉపక్రమిస్తామని జాఫర్ హెచ్చరించారు. ఏపీయూడబ్ల్యూజే కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన నేపథ్యంలో.. వాస్తవాలను ప్రతిబింబించేలా వార్తలు కవర్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం, అక్రమ కేసులు

బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుల్లాయ్ స్వామి, చిరంజీవి, ఏఐవైఎఫ్ సంతష్ కుమార్, ఏఐఎస్ఎఫ్ నగర

కార్యదర్శి రమణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమా మహేష్, నాయకులు వంశీ, ఆనంద్ ,జగదీష్, మనోహర్, రఘు, ఏపీయూడబ్ల్యుజే కో కన్వీనర్ అయూఫ్, ఐజేయూ సభ్యులు గుత్తా ప్రభాకర్ నాయుడు, యూనియన్ నాయకులు కేపీ.కుమార్, చౌడప్ప, అయూబ్, చలపతి , ప్రదీప్ రెడ్డి, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్చార్జి రామకృష్ణ, ప్రజా భూమి బ్యూరో ఇంచార్జ్ రాజా హొన్నూర్, అధిక సంఖ్యలో మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధర్మో రక్షతి  రక్షితః  వృక్షో రక్షతి  రక్షితః

Satyam NEWS

నాగ‌ర్ క‌ర్నూల్‌లో 8న ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

Sub Editor

వైసిపి పాలనతో రాష్ట్రం బ్రష్టు పట్టిపోయింది

Bhavani

Leave a Comment