సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన్ బడ్జెట్ లో ఆర్థిక క్రమశిక్షణ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,సీతక్క, పొడేం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలసి బట్టి విక్రమార్క సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. అంచనాలకు వాస్తవాలకు పొంతన లేకుండా ఈ బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకోసం కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతుందని ఆశించిన ప్రజలకు ఇది ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు.
ఈ బడ్జెట్ లో ఏమీ లేదని ఆయన అన్నారు. హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తేసిందని.. ఆ విషయం ఈ బడ్జెట్ తో స్పష్టం అవుతోందని భట్టి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ లో అంచనాలకు.. వాస్తవాలకు మధ్య అంతరం 20 నుంచి 25 శాతంగా ఉంటోందని కొన్నిసార్లు ఇది 30 శాతంగా కూడా ఉంటోందని ఆయన అన్నారు. లక్షా 82 వేల 17 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. సాధారణ బడ్జెట్ లక్షా 46 వేల 492 కోట్లకు తగ్గిందని అన్నారు. దాదాపు నేరుగా వ్యత్యాసం 36 వేల కోట్ల రూపాయలని అన్నారు. ప్రపోజల్స్ లోనే ఇంత వ్యత్యాసం ఉంటే.. రెగ్యులర్ గా వాస్తవాలకు వచ్చేసరికి.. ఎంత తేడా ఉంటుందో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడ్డాక, అప్పటిదాకా పాలించిన నాయకులు ముందుచూపు, ప్రణాళికల వల్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందని, అసలు కేసీఆర్ పాలనా ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయని అందుకే లోటు కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం ఎంత ఆదాయం నష్టపోతుందో ఈ బడ్జెట్ ను చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, సరైన ప్రణాళికలు రూపొందించపోవడంతోనే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని భట్టి విక్రమార్క అన్నారు.
ఈ బడ్జెట్ ప్రసంగంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రస్తావన ఎక్కడా లేదు, అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించిన వివరాలు ప్రకటించలేదు, ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రకటనా లేదు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల వివరాలకు సంబంధించిన ప్రకటన కూడా లేదని భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు అందరికంటే ముందుగా దానిని అద్భుతం అని ప్రకటించి, సభలో దానిని అమోదించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని భట్టి గుర్తు చేశారు.
ఇప్పుడేమో కేంద్రం నుంచి రావాల్సిన రాబడి రావడం లేదని, కేంద్ర ప్రభుత్వ విధానం వల్లే నష్టపోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదం అని భట్టి అన్నారు. అప్పుడు అభివృద్ది బాగుండి డబ్బులు వస్తే నీ గొప్పతనం, ఇప్పుడు రాకపోతే అది వేరే వాళ్ల తప్పుకింద నెట్టేయడం ఎంతవరకూ సబబు అని భట్టి ప్రశ్నించారు.