29.7 C
Hyderabad
April 29, 2024 09: 01 AM
Slider తెలంగాణ

తెలంగాణలో మత కార్డు వాడితే పని చేయదు

KTR_twitter

ట్విట్టర్ వేదికగా #AskKtr (ఆస్క్ కేటీఆర్) హ్యష్ ట్యాగ్ తో మంత్రి కేటీఆర్ నేడు ప్రజలతో చాటింగ్ చేశారు. ఈ సందర్భంగా అయన పలు అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపైన, వ్యక్తిగత అంశాలు, అభిరుచులపైన ప్రజలకు సమాధానాలిచ్చారు. #AskKtr హ్యష్ ట్యాగ్ చాలసేపు దేశంలో ట్విట్టర్ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా నిలిచింది.

రాష్ర్టంలో పౌర సవరణ చట్టం అమలుపైన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ హిందూ- ముస్లిం కమ్యూనల్ కార్డు ని వాడుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రజలను విభజించే ఏలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైన వారు తెలంగాణ ప్రజలని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైనదని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. నగరంలో శాంతియుత ధర్నాలకు అనుమతుల విషయాన్ని అడగగా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ  కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.

 దేశంలో నలభై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా, ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్ప కాలం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక అభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు ఖచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనపైన  స్పందించిన కేటీఆర్ “ ఒక మంచి ప్రారంభం” అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెంట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఈ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని  ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నడిపినందుకు సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలో  బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పని తీరుపై తమకు అవసరమైన ఫీడ్ బ్యాక్ వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో  రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని “టెన్ ఇయర్ చాలెంజ్”  అంటూ  స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్,  మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైనది అని తెలిపారు.

తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు  ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి పథం భవిష్యత్తులోనూ కొనసాగుతున్నదన్న నమ్మకాన్ని కెటియార్ వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం ప్రారంభమైందని త్వరలోనే మార్పు కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

 హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి అయోగ్ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా, స్పందించిన కెటియార్, ఇతర  నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో నీటి  కొరత చాలా తక్కువగా ఉన్నదని కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా సమస్య తలెత్తదని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించామని, చార్మినార్, గోల్కొండ లకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.

యూరప్, అమెరికా వంటి ప్రాంతాల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో చేపట్టిన srdp ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, భవిష్యత్తుకి అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

హైదరాబాద్ నగరంలో నూతనంగా 50 పుట్  ఒవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని, స్కై వాక్స్ నిర్మాణాలకు అమోదం తెలిపామన్నారు. హైదరాబాదులో ఈ బి ఆర్ టి ఎస్ పద్ధతిలో కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే  ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని తెలిపారు.

హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకువెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తుందని తెలిపారు. గోపనపల్లి లో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీ లకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నారు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిందని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయన్నారు.

111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్దికోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని మంత్రి స్పందించారు.

Related posts

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి భూమా కుటుంబ సభ్యులే

Bhavani

ఏపిలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇది

Satyam NEWS

Leave a Comment