28.7 C
Hyderabad
May 6, 2024 02: 21 AM
Slider ఖమ్మం

కేసీఆర్ కు సవాల్: రైతుల దగా పై చర్చకు సిద్ధమా?

#mallubhattivikramarka

రైతుబంధు పేరుతో రైతులను టిఆర్ఎస్ సర్కార్ దగా చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ దీనికి అంగీకరించకుంటే బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని ముదిగొండ పాదయాత్ర వేదికగా భట్టి సవాల్ విసిరారు.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం, గోకినపల్లి, చిరుమర్రి, ముదిగొండ గ్రామాల్లో సోమవారం రెండవ రోజు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్( పాదయాత్ర) నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిగొండ, వెంకటాపురం, చిరుమరి గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు పెట్టుబడి సాయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెబుతూ వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు బంద్ చేసిందన్నారు.

పంట నష్టపోయిన రైతులకు 8 ఏళ్లుగా ఒక ఎకరానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు, ట్రాక్టర్ల కొనుగోలు పై ఇచ్చే సబ్సిడీ బంద్ చేశారని వివరించారు. రైతుబంధు ఇచ్చి ఎరువుల ధరలు పెంచితే రైతులకు కలిగే ప్రయోజనం ఏంటని కెసిఆర్ ను ప్రశ్నించారు. ఎకరానికి పెట్టుబడి సాయంగా పది వేలు ఇచ్చి రైతుల పై రూ.30 వేల భారం వేస్తున్నది వాస్తవమా? కాదా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.

కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులో 1.25 లక్షల కోట్ల దోపిడీ

కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రూ. 1.25 లక్షల కోట్లను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేశారని ఆరోపించారు. రూ. 28 వేల కోట్ల తో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచారన్నారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ను సీతారామ ప్రాజెక్టు గా మార్చి ఎనిమిదేళ్లుగా ఒక ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని ఆసమర్ధ, అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు.

ప్రాజెక్టుల నిర్మాణాలు పేరిట పాలకులు దండుకున్న ప్రజా సంపదను ప్రజలకు పంపిణీ చేయడానికే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని వెల్లడించారు. అవినీతి మయమైన పాలనను దించడానికి, ప్రజా సమస్యల పరిష్కారంకై కొట్లాడేందుకు మదిరలో మొదలైన పీపుల్స్ మార్చ్ రాష్ట్రం మొత్తం సుడిగుండంలా చుట్టేస్తామన్నారు.
పీపుల్స్ మార్చ్ లో ప్రజలు ఇచ్చిన సమస్యల విన్నపాల పరిష్కారంకై అసెంబ్లీలో ప్రజల గొంతుక గా సర్కార్ ను నిలదీస్తానని, సర్కారు మెడలు వంచి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

పేదల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా?

ఎనిమిదేళ్ల పాలనలో టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు పేద సామాన్య అభివృద్ధి చేయడానికి ఒక పథకమైన తీసుకువచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మూడు పూటలా తిండి పెట్టడానికి తీసుకువచ్చిన ఉపాధి నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. సర్కార్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని తెలిపారు.

భట్టి పాదయాత్రకు తెలుగుదేశం సంఘీభావం

రెండవ రోజు సోమవారం ముదిగొండ మండల కేంద్రంలో కొనసాగిన భట్టి విక్రమార్క పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. పీపుల్స్ మార్చ్ లో తెలుగుదేశం నాయకులు తమ పార్టీ జెండాలు పట్టుకొని విక్రమార్క అడుగులో అడుగులు వేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు మద్దతు తెలిపి పాల్గొన్నవారిలో టిడిపి మండల అధ్యక్షుడు వీరబాబు, మండల కార్యదర్శి గుర్రం సంగయ్య, నాయకులు మాదాల శ్రీను, రామారావు, మల్లారపు యాదాద్రి తదితరులు పాల్గొన్నారు.

మహాత్ములకు నివాళి

ఆయా గ్రామాల్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాత బాబసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి విక్రమార్క ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, పాదయాత్ర నియోజకవర్గ కన్వీనర్ మాజీ జెడ్పిటిసి బుల్లెట్ బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

నిరుపేదలకు చేయుతనిచ్చిన రంగాపురం శివారెడ్డి

Satyam NEWS

ఆడపడుచులకు బతుకమ్మ కానుక: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

మియాపూర్ మహిళల ఆధ్వర్యంలో ఆవిర్భావదినం

Satyam NEWS

Leave a Comment