పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తామని వైసీపీ అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. అసలే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో సత్తెనపల్లిలో సొంత పార్టీ నేతల నుంచి అంబటికి నిరసన సెగ ఎదురైంది. ఎక్కడి నుంచో వచ్చిన అంబటి రాంబాబుకు తాము పని చేసేది లేదని స్థానిక నేతలు కరాఖండిగా చెప్పారు. సత్తెనపల్లి టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి చాలా కీలకమైన నియోజకవర్గం. ఈ సీటు నుంచి దిగ్గజ నేతలు ఎందరో పోటీ చేసి గెలిచారు. మాజీ స్పీకర్, మాజీ మంత్రి దివంగత నేత కోడెల శివప్రసాదరావు కూడా ఇక్కడ నుంచే 2014లో గెలిచారు. 2019 నాటికి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేసి వైసీపీ తరఫున గెలిచారు.
ఇదిలా ఉంటే 2024 లో కూడా తానే పోటీ చేస్తాను అని అంబటి అంటున్నారు. కానీ ఆయనకు సీటు గ్యారంటీ ఉందా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే అంబటి పట్ల సత్తెనపల్లిలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. పైగా అంబటి నాన్ లోకల్ అన్న పేరు ఉంది. ఇక కాపులలో కూడా ఆయనకు అంతగా సానుకూలత లేదు అని అంటున్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ ఉన్నారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్ధిగా ఉంటారు. ఆయన కాపు సామాజికవర్గం నేత. అలా జనసేన మద్దతుతో బాటు ఇక్కడ కాపు ఓట్లు ఆయన వైపే ఉంటాయి. దాంతో అక్కడ కన్నా లక్ష్మీనారాయణకు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ తన అభ్యర్ధిపై మల్లగుల్లాలు పడుతున్నది. మంత్రి అంబటి అభ్యర్ధిత్వం పట్ల సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. ఆయన్ని మార్చాలని కూడా చాలా మంది కోరుతున్నారు. దాంతో అంబటి రాంబాబు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది.
ఎర్రం సత్తెనపల్లిలో గట్టి నాయకుడు. ఆయన 2004, 2009లలో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచారు. మొదటి సారి పాతిక వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎర్రం రెండవసారి ఏడు వేలకే పరిమితం అయ్యారు. ఇక 2019లో జనసేన తరఫున పోటీ చేసిన ఎర్రం వెంకటేశ్వరరెడ్డికి పది వేల ఓట్ల దాకా వచ్చాయి. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది అని అంటున్నారు.
కులాలకు అతీతంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పైగా గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో వరసగా రెండు సార్లు గెలిచిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. దాంతో ఆయన పట్ల వైసీపీ అధినాయకత్వం మొగ్గు చూపుతోంది అని అంటున్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జనంతో మమేకం అవుతున్నారు.
మరి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లో మాజీ ఎమ్మెల్యే చురుగ్గా తిరుగుతున్నారు అంటే హై కమాండ్ ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు. దాంతో అంబటికి సత్తెనపల్లి సీటు ఇవ్వకపోవచ్చు అని ప్రచారం ఊపందుకుంది. అంబటి సొంత నియోజకవర్గం రేపల్లె.
ఈసారి ఆయన్ని అక్కడ నుంచి పోటీ చేయించాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పోటీ చేసి పదకొండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఆయన 2009లో అక్కడ నుంచి గెలిచారు. ఇక 2020లో ఆయన్ని జగన్ రాజ్యసభకు పంపించారు. దాంతో ఆయన ఈసారి పోటీ చేయరని అంటున్నారు. అయితే ఈ సీటులో టీడీపీ గట్టిగా ఉంది. ఇక్కడ నుంచి వరసగా రెండు సార్లు అనగాని సత్యప్రసాద్ గెలిచారు. ఈసారి కూడా ఆయనే అభ్యర్ధిగా ఉంటారని అంటున్నారు. ఆయన్ని ఢీ కొట్టి అంబటి ఇక్కడ నుంచి గెలవాల్సి ఉంటుంది. మరి అంబటికి ఈ సీటు కాకపోతే ఎమ్మెల్సీగా అయినా ఇస్తారని అంటున్నారు. మొత్తానికి సత్తెనపల్లి నుంచి అంబటికి టికెట్ దక్కదని అంటున్నారు. ఆయనకు ఎర్రం ద్వారా టికెట్ కి ఎసరు వస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి.