అసమ్మతి పెరుగుతున్నట్లు చూచాయగా అనుమానం రాగానే దాన్ని ఆదిలోనే తుంచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చతురతను మెచ్చుకోక తప్పదు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు నలుగురు ఎంఎల్ఏల వరకూ పరోక్షంగా అసమ్మతి గళాలు వినిపించారు. ఈటల రాజేందర్ పై రెండు పత్రికలలో వార్తలు రావడం దానిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలుచేయడంతో టిఆర్ఎస్ లో ఏదో జరగబోతున్నదనే సంకేతాలు వెలువడ్డాయి. మంత్రివర్గ విస్తరణ కు పీటముడులు ఉండటం తో వాటిని దాటుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళతారా అనే అనుమానాలు కూడా చాలా మందికి వచ్చాయి.
టిఆర్ఎస్ అంతర్గత విషయాలు ఎంతో గుంభనంగా ఉంటాయి. బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పడానికి అది కాంగ్రెస్ పార్టీ కాదు. పైగా కేసీఆర్ పార్టీపైనా ప్రభుత్వ యంత్రాంగంపైనా పూర్తి స్థాయి పట్టు ఉన్న నాయకుడు. ప్రజాబలం విశేషంగా ఉండటం వల్ల రెండో సారి కూడా సునాయాసంగా అధికారంలోకి వచ్చిన నాయకుడు ఆయన. అందువల్ల లోలోన ఎంత మధనపడుతున్నా పైకి చెప్పేందుకు ఏమీ ఉండదు. ఇది ఒక కారణం అయితే మరో కారణం ఏమిటంటే ప్రభుత్వంలో అందరికి అన్ని పనులు జరిగిపోతున్నాయి.
అందువల్ల నిరసన వ్యక్తం చేసే అవకాశం చాలా తక్కువ. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఇది కూడా మరో కారణం. ఈ అన్ని కారణాల వల్ల కేసీఆర్ కాకుండా ఆయన చుట్టూ ఉన్నవారిపై ఏదైనా అసంతృప్తి ఉన్నా బయటకు చెప్పే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసిన తర్వాత హరీష్ రావుకు, కేటీఆర్ కు ఇద్దరికి మంత్రి పదవులు రాబోతున్నాయని సత్యంన్యూస్ అందరి కన్నా ముందే చెప్పింది. తలెత్తబోయే చిన్న సమస్యలను కూడా ఈ ఒక్క అడుగే శాశ్వత పరిష్కారం అనే అభిప్రాయాన్ని కూడా సత్యం న్యూస్ చెప్పింది.
బహుశ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా బేరీజు వేసుకున్న తర్వాత కేసీఆర్ కూడా ఇదే నిర్ణయానికి వచ్చి ఉంటారు. రాష్ట్రం పై బిజెపి కన్నేసినట్లు ఇప్పటికే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నాలుగు ఎంపి సీట్లు గెలవడంతో బిజెపి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ అవకాశాన్ని అంత ఈజీగా వదులుకోవాలనుకోవడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిన రోజులు ఇవి.
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తమ గొయ్యి తామే తవ్వుకోవడంతో బిజెపికి అనుకోని అవకాశం వచ్చినట్లయింది. ఆంధ్రా నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీని, అసలు నాయకత్వమేలేని కాంగ్రెస్ ను ఎదుర్కొవడం కేసీఆర్ కు పెద్ద కష్టం కాలేదు. బిజెపి అలా కాదు. రాష్ట్ర స్థాయి నాయకత్వం బలహీనంగా ఉన్నా కేంద్రంలో తిరుగులేని అధికారం ఉంది. పైగా మజ్లీస్ పార్టీతో టిఆర్ఎస్ కలిసి కదులుతుండటం బిజెపికి కలిసి వస్తున్న అంశం. ఈ పరిణామాలను ఎదుర్కొవాలంటే పరిపాలన మరింత పటిష్టంగా ఉండాలి.
పార్టీని పటిష్ట పరచుకోవడం కేసీఆర్ లాంటి నాయకుడికి పెద్ద కష్టం కాదు. పరిపాలన గాడిలో పెట్టాలంటే హరీష్ రావు, కేటీఆర్ లాంటి వారు పక్కన ఉండాల్సిందే. అందుకే మిగిలిన వారిలో ఎవరికి పదవులు వచ్చాయి ఎవరికి రాలేదు అనేది ఇక్కడ అప్రస్తుతం అయిపోయింది. హరీష్, కేటీఆర్ లకు మంత్రి పదవులు దక్కడమే ఇక్కడ ప్రధాన వార్త అయింది. హరీష్ కు పెద్ద పీట వేస్తూ ఆర్ధిక మంత్రిత్వ శాఖను అప్పగించడం కూడా ఇక్కడ గమనించదగిన పరిణామం.
పదవి రాకపోయినా ఏ మాత్రం తొణక్కుండా తనకు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్లిన హరీష్ ఓపిక కు కేసీఆర్ ఇచ్చిన బహుమతి ఇది. హరీష్, కేటీఆర్ లకు మంత్రి పదవులు ఇవ్వాలని కేసీఆర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా గాడిన పడినట్లుగా చెప్పవచ్చు.
-సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్ సత్యం న్యూస్