మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన భార్య వసంతలక్ష్మి శనివారం దర్శించుకున్నారు. మంత్రి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకుని సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు చీర, సారాను సమర్పించారు. తల్లులకు మంత్రి పువ్వాడ నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. హుండీలో కానుకలు వేశారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఎన్. ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ దంపతులకు సమ్మక్క-సరాలమ్మ దేవతల చిత్రపటాన్ని అందజేశారు. అమ్మల దీవెనలు తెలంగాణలోని ప్రతీ బిడ్డ మీద ఉండాలని వారు కోరారు. నేడు వన దేవతలను దర్శించుకున్న వారిలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, RTC, రవాణా శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
previous post