కరీంనగర్ నగరంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి (తీగల వంతెన) పనుల ప్రగతిపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో ఆర్ అండ్ బి శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో చీఫ్ ఇంజనీర్ రవీందర్రావు పర్యవేక్షక ఇంజినీర్ రాఘవాచార్యులు కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటరమణ, టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు సూర్య ప్రకాష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 2020 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సస్పెన్షన్ బ్రిడ్జి వినియోగంలోకి రావడానికి హౌసింగ్ బోర్డు జంక్షన్ నుండి ఇ బైపాస్ రహదారి పై ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఫ్లైఓవర్ నిర్మాణం, అవతలివైపు సదాశివ పల్లి వరకు భూసేకరణ చేపట్టవలసిన అవసరం ఉన్నందున సంబంధిత అధికారులతో చర్చించి నిధుల విషయంపై వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
చేపట్టవలసిన సర్వీస్ రోడ్లు, అండర్పాస్, వంతెనపై డైనమిక్ లైటింగ్ చేపట్టేందుకు ప్రతిపాదనల విషయమై మంత్రి చర్చించారు. కరీంనగర్ నుండి వేములవాడకు వయా ఎలగందుల ద్వారా నిర్మాణం జరుగుతున్న రహదారి పనులను కూడా మంత్ర సమీక్షించారు. సాంకేతిక సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ముఖ్య ఇంజనీర్ కి ఆదేశించారు.