33.7 C
Hyderabad
April 30, 2024 01: 29 AM
Slider నిజామాబాద్

తెలంగాణ విద్యారంగంలో మార్పులు తెస్తున్నాం

#SabitaIndrareddy

విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు విద్యాబోధన నష్టపోకుండా డిజిటల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు పుట్టినందుకు తల్లిదండ్రులు, బ్రతికినందుకు బడి రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు

కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి బిటిఎస్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో 2 కోట్ల 95 లక్షలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు పాఠశాల దాత తిమ్మారెడ్డి సుభాష్ రెడ్డి సొంత ఖర్చులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ  సందర్బంగా మంత్రికి విద్యార్థులు పూలు చల్లుతూ, మార్చ్ ఫాస్ట్ నిర్వహించి స్వాగతం పలికారు.

అలరించిన మిట్టపల్లి సురేందర్ పాటలు

ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రముఖ జానపద కళాకారుడు, గాయకుడు మిట్టపల్లి సురేందర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పలు పాటలు అలపించి అందరిని ఉర్రుతలూగించారు. బిబిపేట పాఠశాల స్థితిగతులపై ఆయన స్వయంగా రచించి పాడటంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన వీడియో సీడీని మంత్రి అవిష్కరించగా ఆ వీడియోను స్క్రీన్ పై తిలకించారు.

అభివృద్ధి కోసం సీఎం శ్రమిస్తున్నారు

అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మనసున్న మనిషిగా పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని చెప్పారు. కరోనా లాక్ డౌన్ సమయంలో రైతాంగం, విద్యారంగాలపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. రైతు పండించిన పంటని ఇంటికి తీసుకురావడంతో పాటు విద్యార్థులు విద్య సంవత్సరం నష్టపోకుండా చూసారన్నారు.

విద్యారంగానికి పెద్దపీట

రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా డిజిటల్ విద్యాబోధన కొనసాగుతొందని చెప్పారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే విద్యాబోధన అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని వివరించారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రతి రంగంలో కామారెడ్డి నియోజకవర్గం ముందుకి తీసుకెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విన్నవిస్తారని తెలిపారు. ఇలాంటి నాయకుడు ఇక్కడ ఉండటం హర్షించదగిన విషయమన్నారు.

నిధుల మంజూరికి కృషి చేయండి

ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ లో 635 మంది విద్యార్థులున్న ఏకైక పాఠశాల బిబిపేట పాఠశాల అన్నారు. కొత్త మండలం అయిన తర్వాత 3 కోట్లతో కస్తూర్బా పాఠశాల 50 లక్షలతో ఎంపీడీఓ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మంత్రికి తెలిపారు.

నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల కోసం 98 అదనపు గదులు కావాల్సి ఉందని వివరించారు. కొత్తగా ఏర్పడిన ఈ మండలంలో జూనియర్ కళాశాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దోమకొండ డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేయాలని కోరారు. అనంతరం మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ, వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, టిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Related posts

రెడ్ జోన్ ఎత్తేసినా జాగ్రత్తలు తప్పని సరి

Satyam NEWS

బాటిల్ నెక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అదుపు కీలకం

Bhavani

జగిత్యాలలో ఇసుక స్టాక్ యార్డు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment