32.7 C
Hyderabad
April 27, 2024 02: 47 AM
Slider ప్రత్యేకం

అమ్మా.. క‌రోనా నుంచి అంద‌రికీ విముక్తి క‌లిగించు

#ministeravanthisrinivas

ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు శ్రీ‌శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆశీస్సులు అంద‌రికీ అందాల‌ని.. ఆమె ద‌య, కృప అంద‌రికీ క‌ల‌గాల‌ని రాష్ట్ర మంత్రులు వెలంప‌ల్లి శ్రీ‌నివాసు, బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభిక్షం క‌ల‌గాల‌ని, అంద‌రూ సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని అభిలాషించారు. మంగ‌ళ‌వారం సిరిమానోత్స‌వం సంద‌ర్భంగా మంత్రులు పైడిత‌ల్లి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఆయ‌న‌కు జిల్లా అధికారులు అధికారిక లాంఛ‌నాల‌తో స్వాగ‌తం ప‌లికారు. క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, జేసీ కిశోర్ కుమార్‌, ఆర్డీవో భ‌వానీ శంక‌ర్, ఆల‌య పూజారులు మంత్రికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యం ద‌ర్శ‌నం గావించారు. సంప్ర‌దాయం ప్ర‌కారం ఆల‌య పూజారులు, అర్చ‌కులు పూజా క్ర‌తువులు నిర్వహించారు.

మూడు రాజ‌ధానుల కోరిక తీరుతుంది

ద‌ర్శ‌నం అనంత‌రం మంత్రి వెలంప‌ల్లి మీడియాతో మాట్లాడారు. ఉత్త‌రాంధ్రుల ఇష్ట‌దైవం పైడితల్లి అమ్మ‌వారిని ద‌ర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని, త్వ‌ర‌లోనే క‌రోనా నుంచి విముక్తి క‌ల‌గాల‌ని అమ్మ‌వారిని కోరుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. పైడిత‌ల్లి అనుగ్ర‌హంతో ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ట్లు మూడు రాజ‌ధానుల కోరిక కూడా నెర‌వేరుతుంద‌ని పేర్కొన్నారు. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌లో అధికారుల, ప్ర‌జాప్ర‌తినిధుల, పోలీసుల స‌మ‌న్వ‌యం బాగుంద‌ని మంత్రి అభిప్రాయ‌పడ్డారు.

అంద‌రి స‌హ‌కారంతో ప్ర‌శాంతంగా ఉత్స‌వాలు

జిల్లా ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స్వ‌చ్చంద సంస్థ‌ల‌ స‌హ‌కారంతో సిరిమాను ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగాయ‌ని మంత్రి బొత్స పేర్కొన్నారు. అమ్మ‌వారి చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని ఆకాంక్షించారు. కుటుంబ స‌భ్యుల‌తో పాటు వ‌చ్చి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌ల్పించాల‌ని, అంద‌రినీ కాపాడాల‌ని అమ్మ‌వారిని వేడుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ప్ర‌ముఖులు

పైడిత‌ల్లి సిరిమానోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రంలోని, జిల్లాలోని ప్ర‌ముఖులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. పూస‌పాటి అనువంశిక ధ‌ర్మ‌క‌ర్త‌లైన ఆనంద‌గ‌జ‌ప‌తి, అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుటుంబ స‌భ్యులు వేర్వేరుగా ఉద‌యాన్నే అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. సంప్ర‌దాయం ప్ర‌కారం పూజ‌లు నిర్వ‌హించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి అయిన వెలంప‌ల్లి శ్రీ‌నివాసు, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాసు, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య‌, ఎమ్మెల్సీ సురేష్ బాబు, విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్‌, ఆర్డీవో భ‌వానీ శంక‌ర్ అమ్మ‌వారిని ద‌ర్శించుకొని ఆశీస్సులు పొందారు. సాధార‌ణ భ‌క్తుల‌కు ఉద‌యం 10.00 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి ఉండ‌టంతో తెల్ల‌వారు జాము నుంచే అధిక సంఖ్య‌లో విచ్చేసి ద‌ర్శించుకున్నారు.

కంట్రోల్ రూమ్ నుంచి ప‌ర్య‌వేక్ష‌ణ‌

సిరిమాను ఉత్స‌వ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ప్ర‌క్రియ‌ను పరిశీలించేందుకు ఆల‌య స‌మీపంలో ఏర్పాటు చేసిన సెంట్ర‌ల్ కంట్రోల్ రూమ్‌ను క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి సంద‌ర్శించారు. అక్క‌డ అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. భ‌క్తుల ద‌ర్శ‌నాలు, క్యూలైన్ల ప‌ర్య‌వేక్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై జేసీ, ఆర్డీవోల‌తో మాట్లాడారు. ఎప్ప‌టిక‌ప్పుడు సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని, ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను కూడా ఆమె సంద‌ర్శించారు. ఎండోమెంట్‌, రెవెన్యూ, స‌మాచార పౌర సంబంధాల శాఖ‌, పోలీసు, వైద్యారోగ్య, విద్యుత్తు శాఖ‌లు ప‌లు ర‌కాల సేవ‌లందించాయి. క‌లెక్ట‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి ఉత్స‌వాలకు సంబంధించిన ఏర్పాట్లను జేసీ కిశోర్ కుమార్‌ ఆర్డీవో భ‌వానీ శంక‌ర్, ఇత‌ర విభాగాల అధికారులు ప‌ర్య‌వేక్షించారు.

భ‌క్తుల‌కు కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

జిల్లా క‌లెక్ట‌ర్ ముంద‌స్తు ఆదేశాల మేర‌కు ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల‌కు, సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వైద్యారోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. తొలేళ్లు ఉత్సవం రోజున‌, సిరిమాను రోజున భ‌క్తుల‌కు కోవిడ్ వ్యాక్సిన్ అంద‌జేశారు. అలాగే వైద్యారోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో ఫస్ట్ ఎయిడ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. 104, 108 వాహ‌నాల‌ను సిద్ధంగా ఉంచారు.

స్వ‌చ్ఛంద సంస్థ‌ల దాతృత్వం

పైడిత‌ల్లి ఉత్స‌వాల నేప‌థ్యంలో కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు త‌మ దాతృత్వాన్ని చాటుకున్నాయి. భ‌క్తుల‌కు, ఇత‌రుల‌కు మ‌జ్జిగ‌, మాస్కులు పంపిణీ చేశాయి. కొంత‌మంది వాలంటీర్లు స్వ‌చ్ఛందంగా సేవ‌లందించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వాలంటీర్లు, ఎన్‌.సి.సి. విద్యార్థులు భ‌క్తుల‌కు సేవ‌లందించారు. ఈ సంద‌ర్భంగా జేసీ కిశోర్ కుమార్ ఓ స్వ‌చ్ఛంద సంస్థ స్పాన్స‌ర్ చేసిన‌ మాస్కుల‌ను భ‌క్తుల‌కు అంద‌జేశారు. కోవిడ్ వేళ అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా జేసీ భ‌క్తుల‌కు సూచించారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

ఓటింగ్ లో పాల్గొనాలి

Sub Editor

పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగాలి

Satyam NEWS

బ్లీచింగ్ పౌడర్, కరోనా కిట్స్,108 వాహనాలు కాదేదీ స్కాం లకు అనర్హం

Satyam NEWS

Leave a Comment