ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని నినాదం తీసుకున్న బిజెపి మోడీని మళ్లీ ప్రధానిని చేసుకున్నట్లే ఇప్పుడు ఔర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్ అంటున్నారు భారత ప్రధాని నరేంద్రమోడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్ హౌడీ మోడీలో ప్రధాని మోడీ నేరుగా ట్రంప్ ఎన్నికకు తన మద్దతు ప్రకటించారు. ట్రంప్ లాంటి స్నేహితుడు ఉంటే అమెరికా భారత్ లు మరింత స్నేహపూర్వకంగా ఉండగలుగుతాయని చెప్పారు. సత్యంన్యూస్ ముందే చెప్పినట్లు హౌడీ మోడీ కార్యక్రమం మొత్తం భారతీయ అమెరికన్ లను ట్రంప్ వైపు మొగ్గేలా చేసేందుకే నిర్దేశించినట్లుగా కనిపిస్తున్నది.
ట్రంప్ ను భారత్‌కు నిజమైన స్నేహితుడంటూ ఆహూతులకు మోడీ పరిచయం చేయడం వెనుక ఆయనకు ఎన్నికల్లో లబ్ది చేకూర్చేందుకు వ్యూహమే ఉంది. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. ‘వి.. ద పీపుల్’ అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని, ఇదే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు రుజవని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగ సమయంలో ‘యూఎస్‌ఏ.. యూఎస్‌ఏ’ అంటూ ప్రేక్షకులు నినదించడం విశేషం. ట్రంప్ ప్రసంగం అనంతరం మోడీ మరోసారి కీలక ప్రసంగం చేశారు.
మోడీ తన మొదటి ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో, తదుపరి ప్రసంగాన్ని హిందీలో చేయడం విశేషం. మోడీ ఒంటరిగా జీరో, ఒక సామాన్య వ్యక్తి.. 130 కోట్ల భారతీయుల ఆదేశాలు పాటిస్తున్న సాధారణ వ్యక్తి. అయినా మీరు హౌడీ మోడీ అంటుంటే నాకొకటే అనిపిస్తోంది. నా జవాబు ఒకటే భారత్‌లో అంతా బావుంది(భారత్ మే సబ్ అచ్చాహై) అని అన్నారు. అనంతరం తెలుగులో అంతా బావుంది అని ఆయన తెలుగు పదాలు ఉచ్ఛరించారు. తెలుగు తో సహా వివిధ భారతీయ భాషల్లో ఆ పదాన్ని మోడీ ఉచ్ఛరించారు. దాంతో స్టేడియంలో మోడీ నినాదాలు మిన్నంటాయి.
మోడీ ప్రసంగంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు భారతీయ అమెరికన్లు ఎంతో భావోద్వేగంతో స్పందించారు. ముఖ్యంగా 70 ఏళ్ల సమస్యకు ఫేర్‌వెల్ పలికాం.. జమ్మూకశ్మీర్ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్న ఆర్టికల్ 370కి వీడ్కోలు పలికాం. అక్కడి ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేశాం. 370 రద్దుపై పార్లమెంటులో పెద్ద చర్చే జరిగింది. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ బిల్లు విజయం సాధించింది. ఇందుకు మన పార్లమెంటేరియన్లకు మనం నిల్చుని హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలుపుదాం.(స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్).
ఇది కొన్ని ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలవారికి(పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి) నచ్చట్లేదు. ఇప్పుడు సమయమొచ్చింది. ఉగ్రవాదంపై, దానికి మద్దతిచ్చే వారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి ట్రంప్ నేతృత్వం వహించాలి అంటూ మోడీ ఎంతో భావోద్వేగంతో చెప్పారు. అంతే కాకుండా ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు. ఈ సభ మొత్తం ట్రంప్ మోడీల చుట్టూ తిరగడం ఒక విశేషమైతే ట్రంప్ మోడీ ప్రసంగానికి చప్పట్లు కొట్టడం మరొక విశేషం. ఒకప్పుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ అండతో తమ అధ్యక్షుడిని ఎన్నుకునే స్థితికి వచ్చింది.