దేశంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు జగన్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలి సారిగా ఆయన అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగాయి. అయినా ముందుకే వెళ్లిన చంద్రబాబునాయుడికి ఉద్ధండరాయుని పాలెంలో మహిళలు ఘన స్వాగతం పలికారు.
పర్యటన అనంతరం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశం సింగపూర్ అని అలాంటి దేశాన్ని అమరావతి నిర్మాణంలో తాము భాగస్వాములను చేస్తే జగన్ సింగపూర్ ను రాజధాని నుంచి వెళ్ళగొట్టారని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని స్మశానంగా చెబుతున్నారని, మరి మంత్రులు స్మశానం నుంచి పాలన చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. సీయం స్మశానంలో క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి డబ్బులు అవసరం లేదు. భూమిని అభివృద్ధి చేస్తే నిధులు వస్తాయి. రాజధాని భూములపై రెండు లక్షల కోట్లు నిధులు సృష్టించాం అని ఆయన చెపారు. రాజధాని నిర్మాణం కోసం 42 వేల కోట్ల పనులు ప్రారంభించానని ఆయన తెలిపారు. నేను బతికి ఉన్నంత కాలం రాష్ట్రంలో పులివెందుల పంచాయితీ జరగనివ్వను అని ఆయన చెప్పారు.