మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని, ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసిన వారిని ప్రజలు విశ్వసించరని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ పట్టణంలో విశ్వనాథ్ పేట్, వైయస్సార్ కాలనీ, గాజుల పేట్, బైల్ బజార్, గంజ్ బకాష్, ప్రియదర్శిని నగర్, బర్కత్ పురా, గాంధీ నగర్, కబూతర్ కమాన్, మదీనా కాలనీ, ఇందిరానగర్, బుధవార్ పేట్, వార్డుల్లో అభ్యర్థులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా పలుచోట్ల మంత్రికి మహిళలు మంగళహారతులు పట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీయం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ విజయానికి సోపానాలని తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించి ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
ఎజెండా లేని జెండా పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని, విపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు..మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. గత ఐదేండ్లలో నిర్మల్ పట్టణం ఎంతో అభివృద్ది చెందిందన్నారు. రహదారుల విస్తరణ, మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టామని, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ప్రజలకు వివరించారు.
అలాగే పట్టణంలోని పేదలకు అవసరమైన డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ అభివృద్ధి విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ గుర్తు అయిన కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, గండ్రత్ ఈశ్వర్, రాంకిషన్ రెడ్డి, ఎర్రవోతు రాజేందర్, మారుగొండ రాము, ధర్మాజీ రాజేందర్, అయ్యన్నగారి రాజేందర్, మల్లికార్జున రెడ్డి, భూషణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.